ఎట్టకేలకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఓ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు రజినీకాంత్ స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాలు తమిళనాడును చూసి నవ్వుకుంటున్నాయన్న రజినీ.. రాజకీయ విప్లవానికి ఇదే సరైన తరుణం అని అన్నారు. మీట్ అండ్ గ్రీట్ పేరిట డిసెంబర్ 26వ తేదీ నుంచి నేటి వరకు నిత్యం జిల్లాల వారిగా అభిమానులతో భేటీ అయిన రజినీకాంత్.. నేటి తన చివరి రోజు సమావేశాల్లో తమ మనసులో మాటను వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరకుండా తానే ఓ సొంత పార్టీ స్థాపిస్తానన్న తళైవా.. రాష్ట్రంలోని 234 స్థానాల్లో తాను పోటీ చేస్తాను అని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత ఆషామాషీ విషయం కాదు. కాకపోతే తన కర్తవ్యం తాను నిర్వర్తించడానికి శాయశక్తులా కృషిచేస్తాను. సత్యం, శ్రమ, అభివృద్ధే ధ్యేయంగా తాను ముందుకు సాగుతాను అని రజినీకాంత్ ప్రకటించారు. తమిళ సూపర్ స్టార్ చేసిన ఈ ప్రకటన తమిళతంబీల్లో, ప్రత్యేకంగా అతడి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్టార్ అభిమానులు కొత్త సంవత్సరాన్ని ఒక రోజు ముందుగానే వేడుకగా జరుపుకుంటున్నారు. కచ్చితంగా తమ తర్వాతి సీఎం రజినీకాంత్ అవుతారని నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.