ప్రస్తుతం నడుస్తున్న వివాదాల దృష్ట్యా రాఫెల్ ఒప్పందం రద్దయ్యే అవకాశం ఉందన్న వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆదివారం ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. జైట్లీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారాంశం మొత్తమిదీ..
‘రాఫెల్ ఒప్పందంపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. కాగ్ రిపోర్ట్ కోసం వేచి ఉన్నాం. రిపోర్టు వచ్చాకే దీనిపై మరింత స్పష్టత వస్తుంది. రాఫెల్ ఒప్పందం రద్దయ్యే అవకాశమే లేదు. గత యూపీఏ హయాంలో వీటికి ఖర్చు పెట్టిన బడ్జెట్ కంటే తక్కువ ధరకే తెప్పిస్తున్నాం. విపక్షాలు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు. నిజనిజాలన్నీ కాగ్ నివేదికలో వెల్లడవుతాయి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కాగ్ దగ్గరే ఉన్నాయి. కాంగ్రెస్ కూడా కాగ్నే ఆశ్రయించింది. కాగ్ రిపోర్టు రాగానే దీనిపై మరింత స్పష్టత వస్తుంది’ అని జైట్లీ పేర్కొన్నారు.
అటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను జైట్లీ ఖండించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని జైట్లీ ఆరోపించారు.