న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఈసారి ఆయనపై కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రియాంకా గాంధీ వాద్రా కూడా వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్టుగా పలు ప్రకటనలు ఇవ్వడమే అందుకు కారణం. అయితే, తాను అక్కడి నుంచి పోటీ చేయాలా వద్దా అనేది మాత్రం పార్టీనే నిర్ణయిస్తుందని ప్రకటించిన ప్రియాంక గాంధీ ఆ తర్వాత వారణాసి రేసు నుంచి తప్పుకోవడం చర్చనియాంశమైంది. ఏ కారణం చేత ఆమె వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయలేదు అని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు జరిగాయి.
అయితే, తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆ ప్రశ్నలన్నింటిపైనా స్పందించిన ప్రియాంకా గాంధీ.. వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. వారణాసి నుంచి పోటీ విషయమై కాంగ్రెస్ పార్టీలో అందరు అగ్రనేతలు, ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నేతల సలహా తీసుకున్నాను. వాళ్లంతా ఏం చెప్పారంటే.. మీరు (ప్రియాంక) కేవలం ఒక వారణాసి స్థానానికే పరిమితమైపోకుండా ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని 41 లోక్ సభ స్థానాలు చూసుకునే బాధ్యత మీపై ఉందని గుర్తుచేశారు. వాళ్లు చెప్పినట్టుగానే తాను ఒక్క లోక్ సభ స్థానంపై దృష్టిపెడితే, మిగతా స్థానాల అభ్యర్థులు నిరాశకు లోనయ్యే అవకాశాలున్నాయి. అందువల్లే తాను వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయలేదని ప్రియాంకా గాంధీ వివరణ ఇచ్చారు.