హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన 5వ విడుత పోలింగ్ పూర్తయింది. సోమవారం ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు 424 స్థానాలకు పోలింగ్ పూర్తయినట్టయింది. 5వ విడతలో 62.56 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, స్మృతి ఇరానీ, జయంత్ సిన్హా, అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు పోటీచేస్తోన్న లోక్ సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది.
జమ్మూకశ్మీర్ పుల్వామాలో పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. అదృష్టవశాత్తుగా ఈ దాడుల్లో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మే 12న 6వ విడత ఎన్నికలు, మే 19న ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అన్ని లోక్‌సభ స్థానాల ఫలితాలు మే 23న వెల్లడించనున్నారు.
ఏపీలో రీపోలింగ్ ప్రశాంతం:
నరసరావుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 94వ పోలింగ్ కేంద్రంలో, గుంటూరు పశ్చిమ స్థానం పరిధిలోని 244వ పోలింగ్ కేంద్రంలో, యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం పరిధిలోని 247వ పోలింగ్ కేంద్రంలో, కోవూరు అసెంబ్లీ స్థానం పరిధిలోని 41వ పోలింగ్ కేంద్రంలో, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రంలో నేడు నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.