ఠాగూర్ నగర్: నేడు పశ్చిమ బెంగాల్‌లోని ఠాగూర్ నగర్‌లో పర్యటిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ, నేటి సభతో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్‌పై ప్రధాని మోది తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుణమాఫీ పేరుతో దేశంలోని రైతులందరినీ అన్ని పార్టీలు మోసం చేశాయని మోదీ అన్నారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధిని నాయకులు అసలే పట్టించుకోలేదని చెబుతూ... ఇకపై నవ భారత్ నిర్మాణం అలా ఉండబోదని స్పష్టంచేశారు.
గత 4.5 ఏళ్లలో దేశంలోని రైతులు, వ్యవసాయ కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసిందని చెబుతూ నిన్న పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సైతం మోదీ క్లుప్తంగా ప్రస్తావించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 5 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ.6000 ఇవ్వనున్నామని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు.
ఠాగూర్ నగర్ ర్యాలీలో తొక్కిసలాంటి పరిస్థితి ఎదుర్కునే సూచనలు కనిపించడంతో 14 నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని అనుకున్నదానికన్నా ముందుగానే ముగించినట్టు పీటీఐ పేర్కొంది. ఠాగూర్ నగర్ సభ అనంతరం ఇవాళ మధ్యాహ్నం తర్వాత దుర్గా నగర్‌లో జరగనున్న మరో బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర పాల్గొని ప్రసంగించనున్నారు.