'కరోనా వైరస్' మహమ్మారి.. మానవ చరిత్రనే ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనిషి మనుగడకే సవాల్ విసురుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిన ఈ మహమ్మారిని మూకుమ్మడిగా ఎదుర్కోవాలని మరోసారి పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఎదుర్కుంటున్న పరిస్థితులను వారికి వివరించారు. వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్న తీరును ప్రధాని అభినందించారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని వర్గాల వారు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల తీరును ఆయన అభినందించారు. పార్టీలపరంగా ఇంకా ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వాలని అన్ని పార్టీల నాయకులను ప్రధాని మోదీ కోరారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సోషల్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందన్నారు. వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ పొడగింపు కోసం కోరుతున్నాయని ఎంపీలతో మోదీ అన్నారు. ఐతే ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.