వరుసగా మూడో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

వరుసగా మూడో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

Last Updated : Oct 20, 2018, 04:11 PM IST
వరుసగా మూడో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చమురు ధరల నుంచి సామాన్యులకు కొంత ఊరట లభించింది. వరుసగా మూడో రోజు పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడి చమురు ధర పడిపోవటంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కొంత పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 12 పైసలు తగ్గాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.81.99లు ఉండగా, డీజిల్‌ రూ.75.36లుగా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో లీటర్‌ పెట్రోల్‌పై 38 పైసలు, డీజిల్‌పై 13 పైసలు తగ్గాయి. ధరలు తగ్గిన అనంతరం ముంబాయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.87.46లు ఉండగా డీజిల్‌ రూ.79లు ఉంది.

అలాగే కోల్‌కతా, చెన్నై నగరాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. శుక్రవారం కోల్‌కతా‌లో లీటరు పెట్రోల్ 83.83 రూపాయలుగా, లీటర్ డీజిల్ రూ. 77.21గా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర లీటరు 85.22 రూపాయలుగా, డీజిల్ ధర లీటరు రూ.79.69 వద్ద స్థిరపడింది.

అటు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరు రూ.86.92, డీజిల్ ధర లీటర్ రూ.81.97కి చేరింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.85.98 ఉండగా, డీజిల్‌ రూ.80.66గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం, శుక్రవారం కూడా తగ్గాయి.

అటు రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను కళ్లెం వేయడానికి సోమవారం సాయంత్రం (15.10.2018)న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇంధన సంస్థల ప్రతినిధుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంధనం ధరల పెరుగుదలపై సమీక్షించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని చమురు సంస్థల ప్రతినిధులకు తెలిపారు.

ఈ నెల 5న లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 (ఎక్సైజ్‌ సుంకం రూ.1.50, చమురు కంపెనీల సబ్సిడీ రూపాయి) తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. మళ్లీ ఇంధనం ధరలు పెరిగిపోయాయి. దీంతో మరోమారు సమావేశం నిర్వహించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

Trending News