స్వచ్ఛ భారత్ మిషన్‌కి ఓ పాకిస్తాన్ చిన్నారి రాయబారి (బ్రాండ్ అంబాసిడర్)గా ఎంపికైందన్న సమాచారం దుమారం రుపింది. 'స్వచ్ఛ్ జముయ్ స్వస్త్ జముయ్' బుక్‌లెట్ కవర్ పేజీ మీద పాక్ చిన్నారి ముఖచిత్రాన్ని ముద్రించడం పట్ల కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహార్‌లోని జముయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని జముయ్ జిల్లాలో ‘స్వచ్ఛ జముయ్ స్వస్త్ జముయ్’ నినాదంతో అధికారులు కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందుకోసం రూపకల్పన చేసిన ఆహ్వాన బుక్‌లెట్ కవర్ పేజీపై బ్రాండ్ అంబాసిడర్‌గా పాకిస్తాన్‌కు చెందిన బాలిక ఫోటోను ముద్రించారు. శుక్రవారం రాత్రి ఈ విషయం వెలుగులోకి రాగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో చిత్రంలో ఆ చిన్నారి పాక్ జెండాను గీసినట్లు ఉండటంతో వివాదం మరింత ముదిరింది. పైగా ఆ బాలిక పాక్ తరఫున యూనిసెఫ్‌కు ప్రచారకర్త అని తెలిసింది. దీంతో స్థానికులు జిల్లా పరిపాలన కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. అయితే పాట్నాలోని ముద్రణ సంస్థ-సుప్రబ్ ఎంటర్ ప్రైజెస్ ప్రింటింగ్ ప్రెస్ పొరపాటు మూలంగానే ఇది జరిగిందని అధికారులు తెలిపారు. బుక్‌లెట్‌లను సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు.