Online Gaming Apps: విదేశీ ఆన్‌లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌పై కన్నెర్ర చేసిన కేంద్రం

Offshore based Online Gaming Apps: క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రియులంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. మొన్నామధ్య వరకు ఐపీఎల్ సీజన్, ఆ తర్వాత ఆసియా కప్ వెనువెంటనే వినోదాన్ని పంచిపెట్టాయి. ఆసియా కప్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ 2022 సంబరం క్రికెట్ ప్రియులు మరోసారి గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. 

Written by - Pavan | Last Updated : Oct 27, 2022, 07:39 PM IST
  • విదేశీ గేమింగ్ యాప్స్‌పై కన్నేసిన కేంద్రం
  • ఎవరెవరికి ఎలాంటి జీఎస్టీ రూల్స్ ఉన్నాయంటే..
  • ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీని దెబ్బ కొడుతున్న విదేశీ యాప్స్
  • విదేశాల్లోనే బిజినెస్ ఆపరేషన్స్ ఎందుకంటే..
  • నెలకు కనీసం రూ. 5 వేల కోట్ల ఆదాయం వెనకేస్తున్న యాప్స్
Online Gaming Apps: విదేశీ ఆన్‌లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌పై కన్నెర్ర చేసిన కేంద్రం

Offshore based Online Gaming Apps: మనం క్రికెట్ చూసినా.. లేక సినిమా చూసినా.. అది ఫేమస్ వెబ్ సిరీస్ అయినా.. అర్థగంట టీవీ షో అయినా.. మధ్యమధ్యలో బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ అడ్వర్టైజ్‌మెంట్స్ దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనల్లో కొన్ని జనం మెచ్చిన ఫేవరైట్ క్రికెట్ స్టార్స్, నటీనటులు కూడా ఎండార్స్ చేస్తుంటారు. ఈ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ హంగామా టీవీలకు మాత్రమే పరిమితం కాలేదు.. మొబైల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాతో పాటు రోడ్డు పక్కన బిల్ బోర్డ్స్‌పై.. ఇలా ఎక్కడపడితే అక్కడ అవే యాడ్స్ కనిపిస్తున్నాయి.

ఇందులో అధిక సంఖ్యలో మొబైల్ యాప్స్ భారత్‌లో కాకుండా విదేశీ గడ్డపై నుంచే ఆపరేట్ అవుతున్నాయి. విదేశీ గడ్డపై నుంచి ఆపరేట్ అవుతున్న కారణంగానే భారత్‌లో వ్యాపారం చేసుకుంటునే భారీ మొత్తంలో ఆదాయ పన్ను ఎగవేస్తున్నాయి. ఇదే విషయమై రెవిన్యూ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను అప్రమత్తం చేస్తూ సుమారు 2 డజన్లకుపైగా యాప్స్ జాబితాను అందచేసింది. సదరు యాప్స్‌పై భారత్‌లో నిషేధం విధించాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. నిషేధించాల్సిందిగా సూచిస్తూ కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన మొబైల్ యాప్స్ జాబితాలో పరిమ్యాచ్, డఫాబెట్, బెట్‌వే, 22 బెట్, 1xBet యాప్స్ ఉన్నాయి. 

విదేశీ గేమింగ్ యాప్స్‌పై కన్నేసిన కేంద్రం
ఈ గేమింగ్ యాప్స్‌పై ఓ కన్నేసిన ప్రభుత్వం.. వాటికి ఏ రూపంలో ఎంత ఆదాయం వస్తోంది, ఎంత పన్ను ఎగవేస్తున్నారు అనే కోణంలో వివరాలు రాబడుతోంది. ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసే జిఎస్టీ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ జనరల్, ఇన్‌కమ్ ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగాలు కూడా ఈ యాప్స్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఏ క్షణమైనా దర్యాప్తు బృందాలు ఈ యాప్స్‌పై విరుచుకుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఎవరెవరికి ఎలాంటి జీఎస్టీ రూల్స్ ఉన్నాయంటే..
ఇండియాలో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ వ్యాపారం విలువ సుమారు రూ. 2 బిలియన్ డాలర్స్ వరకు ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటి గేమింగ్ యాప్స్‌కి, నైపుణ్యం, మెళకువలు పెంపొందించే యాప్స్‌కి జీఎస్టీ చట్టాలు పూర్తి వేర్వేరుగా ఉన్నాయి. నైపుణ్యం ఆధారిత మొబైల్ అప్లికేషన్స్‌కి ప్లాట్‌ఫామ్ ఫీజుపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా..  బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటి గేమింగ్ యాప్స్‌కి కాంటెస్ట్ ఎంట్రీ ఫీజుపైనే 28 శాతం జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంది. ఈ గణాంకాల ప్రకారం లెక్కిస్తే.. ఈ యాప్స్ నుండి సుమారు 40 - 50 కోట్ల డాలర్ల ఆదాయం టాక్సుల రూపంలో రావాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగడం లేదు.

విదేశీ యాప్స్ కారణంగా ఇబ్బందులపాలవుతున్న ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ..
ఇదిలావుంటే, మరోవైపు విదేశాల్లో ఉండి ఇండియాలో వ్యాపార కార్యకలాపాలు సాగించి ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్న ఈ యాప్స్ ఇచ్చే పోటీ కారణంగా ఇండియాలో చట్టాలకు లోబడి కార్యకలాపాలు సాగిస్తున్న గేమింగ్ ఇండస్ట్రీ సైతం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది. గేమింగ్ ఇండస్ట్రీలో అమలవుతున్న చట్టాలు, పన్ను చెల్లింపులు, గూగుల్ పాలసీలో మార్పులు వంటివి ఇందుకు మరో ప్రధాన కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా డఫాబెట్, బెట్‌వే, బెట్ 365, పరిమ్యాచ్, ఫెయిర్ ప్లే, 1xbet లాంటి యాప్స్ కారణంగా ఇండియన్ ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ప్రతీ ఏడాది కనీసం 25 - 30 బిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. 

విదేశాల్లోనే ఎందుకు బిజినెస్ ఆపరేషన్స్..
మాల్టా, కురకావో, బెలిజ్, గిబ్రల్టార్ వంటి విదేశాల నుంచే ఈ విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ఆపరేట్ అవుతున్నాయి. ఈ యాప్స్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో భారత్‌తో సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ.. విదేశాల్లో ఎక్కడైతే పన్నులు, చట్టాలు తేలిగ్గా ఉంటాయో అక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ భారత్‌లో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. విదేశాల్లో ఉంటూ భారత్‌లో జరిగే క్రీడా పోటీలు లేదా వినోద రంగాన్ని ఉపయోగించుకుని తమ బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుని భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రకటనలపై భారత ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ.. నిర్వాహకులు ప్రభుత్వం కన్నుగప్పి తమ పని కానిచ్చుకుంటున్నారని తాజా పరిశీలనలో తేలింది.

నెలకు కనీసం రూ. 5 వేల కోట్ల ఆదాయం
మీడియాలో వస్తోన్న వార్తా కథనాల ప్రకారం భారత్‌లో ఈ తరహా విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ నెలకు కనీసం రూ. 5 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వెనకేస్తున్నట్టు తెలుస్తోంది. అలా అక్రమంగా ఆర్జిస్తోన్న మొత్తం ఉపయోగించి పెద్ద పెద్ద టీవీ ఛానెళ్లు, వారి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో తమ యాడ్స్ ప్రసారం అయ్యేలా వారిని ఈజీగానే ఒప్పించుకుంటున్నారు. అంతేకాదు.. సొంతంగానే న్యూస్ వెబ్‌సైట్స్ పెట్టడం, క్రీడా జట్లకు స్పాన్సర్స్‌గా ఉంటూ ఆయా జట్ల జెర్సీలపై తమ లోగోలు ప్రముఖంగా కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వెబ్‌సైట్స్‌లోనూ ప్రముఖంగా కనిపించేలా యాడ్స్ ఇస్తున్నారు. అడ్వర్టైజ్‌మెంట్స్‌కి పెట్టిన ఖర్చుతో యూజర్‌బేస్ పెంచుకుని మరింత ఆదాయం పొందేలా వ్యూహరచనలు చేసుకుంటున్నారే తప్పించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను మాత్రం చెల్లించడం లేదు. దీంతో ప్రస్తుతం కేంద్రం ఈ తరహా విదేశీ యాప్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.

Also Read : IND vs NED: నెదర్లాండ్స్‌పై భారత్ విజయం.. భారత్ ఖాతాలో 4 పాయింట్స్!

Also Read : BCCI: బీసీసీఐ సరికొత్త నిర్ణయం, ఇకపై మహిళా క్రికెటర్లకు సైతం సమాన వేతనం

Also Read : Bhuvneshwar Kumar: నెదర్లాండ్స్‌కు చుక్కలు చూపించిన భూవీ.. బ్యాట్స్‌మెన్‌ విలవిల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News