లండన్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నిందితుడిగా వుండి లండన్‌కి పారిపోయిన వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీని మార్చి 19న అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో బెయిల్ కోసం నిరవ్ మోడీ దరఖాస్తు చేసుకోగా లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ని కొట్టిపారేసింది. నేడు శుక్రవారం నిరవ్ మోడీ రెండోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మరోసారి అతడికి బెయిల్ నిరాకరించిన కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది.
విదేశాలకు పారిపోయిన నిరవ్ మోడీని అరెస్ట్ చేయాల్సిందిగా భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో గతేడాది జూన్‌లో ఇంటర్‌పోల్ విభాగం నిరవ్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే లండన్ పోలీసులు నిరవ్ మోడీని అదుపులోకి తీసుకోగా.. అతడిని తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.