దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో మొదలుపెట్టాయి. సోమవారం ఉదయం ట్రేడ్ మొదలవగానే బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో మొదలైంది. నిఫ్టీ ట్రేడింగ్ మొదట్లోనే తొలిసారి 11,400 మార్కును చేరుకుంది. సెన్సెక్స్ కూడా 236.9 పాయింట్లు లాభపడి 37793.06 ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 63.9 పాయింట్ల లాభంతో 11,424.70 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాలతో దూసుకెళ్తున్నాయి.
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యూపీఎల్, టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాయి. హెచ్‌యూఎల్, కొటక్ మహీంద్రా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతి ఇన్‌ఫ్రాటెల్ తదితర కంపెనీలు షేర్లు నష్టపోతున్నాయి. కార్పొరేట్ క్యూ1 ఫలితాలు.. మార్కెట్లలోని ఈ సానుకూల వాతావరణానికి ప్రధాన కారణం. బీఎస్ఈలో ఆర్ఐఎల్, ఐసీఐసీఐ, ఆదానీ.. నిఫ్టీలు సెయిల్, ఆర్ కామ్, ఆదానీ పవర్లు అధికంగా లాభాలను ఆర్జిస్తున్నాయి.
శుక్రవారం సాయంత్రం 68.61 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో 68.57 వద్ద ట్రేడవుతోంది.