హైదరాబాద్: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. గతంలో ముస్లిం ఓటర్లపై సిద్ధూ చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని నిషేధం విధించిన ఎన్నికల సంఘం తాజాగా సిద్ధూకి మరోసారి నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ 29న భోపాల్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై సిద్దూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
రఫేల్ జెట్ డీల్ విషయంలో ప్రధాని మోదీ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, ధనవంతులు జాతీయ బ్యాంకులను దోచుకుని దేశం విడిచిపారిపోయేందుకు సహకరిస్తున్నారని సిద్ధూ చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలను సమీక్షించిన అనంతరమే ఎన్నికల సంఘం సిద్దూకు నోటీసులు జారీచేసింది. 24 గంటల్లోగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా ఇసి సిద్ధూను ఆదేశించింది. సిద్ధూ ఇచ్చే వివరణ ఏ మాత్రం సంతృప్తికరంగా లేకపోయినా.. ఇసి సిద్ధూపై మరోసారి చర్య తీసుకునే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.