క్రమశిక్షణ పేరునే వారు నిరంకుశత్వంగా మార్చారు: నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Last Updated : Sep 3, 2018, 11:24 AM IST
క్రమశిక్షణ పేరునే వారు నిరంకుశత్వంగా మార్చారు: నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు చేసిన సేవలను ప్రధానాంశంగా తీసుకొని రచించిన ఆ పుస్తకం పేరు "మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఏ ఇయర్ ఇన్ ఆఫీస్". ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోదీ వెంకయ్యను ఎంతగానో కొనియాడారు. ఆయనను క్రమశిక్షణకు మారుపేరుగా కీర్తించారు.

"ఈ రోజు క్రమశిక్షణ అనే పదానికి అర్థం మారిపోయింది. ప్రజల బాగోగుల కోసం ఏ మాత్రం కఠినంగా వ్యవహరించినా దానిని క్రమశిక్షణ చర్యగా స్వీకరించడానికి బదులు.. నిరంకుశత్వంగా అర్థం చేసుకుంటున్నారు. అయితే వెంకయ్య గారు చాలా క్రమశిక్షణ కలిగిన మనిషి. ఆయన క్రమశిక్షణను గురించి నలుగురికీ చెప్పడమే కాదు.. తాను కూడా ఎప్పుడూ క్రమశిక్షణను తప్పలేదు" అని మోదీ తెలిపారు. "ఆయన ప్రజా జీవితంలో దాదాపు 50 సంవత్సరాలుగా ఉన్నారు. అందులో 10 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా జీవితం గడిపితే.. మరో 40 సంవత్సరాలు జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించారు" అని మోదీ అన్నారు. 

"వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వెంకయ్యనాయుడికి తన క్యాబినెట్‌లో అత్యున్నత పదవిని ఇవ్వాలని భావించారు. కాకపోతే వెంకయ్యనాయుడు తనకు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించమని కోరారు. ఆయనకు పల్లెలన్నా, మనుషులన్నా అంత ప్రేమ. స్వతహాగా రైతుగా బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు.. ఎప్పుడూ రైతు సంక్షేమంతో పాటు వ్యవసాయాభివృద్ధి గురించే ఆలోచించేవారు. ప్రధానమంత్రి గ్రామసాధక యోజన లాంటి పథకం రూపుదిద్దుకుందంటే అందుకు కారణం వెంకయ్య నాయుడు మాత్రమే" అని మోదీ తెలిపారు.

Trending News