తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చేస్తున్న పూజలు, యాగాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మంగళవారం నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన మోదీ మాట్లాడుతూ. కేసీఆర్‌ను ఆత్మవిశ్వాసం పట్ల నమ్మకం లేని వ్యక్తిగా పేర్కొన్నారు. పూజలు, యాగాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టే కేసీఆర్.. ప్రజల విషయంలో మాత్రం అసలు పట్టింపు లేని వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్‌భవను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ బీజేపీ నినాదమని.. ఆయుష్మాన్‌భవ పథకంతో 3 లక్షలమంది ప్రాణాలు కాపాడిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మోదీ అన్నారు. ఆ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం అమలు చేయలేకపోతే తాము ఏమీచేయలేమన్నారు. కేసీఆర్ ఒక అబద్ధాలకోరని.. తాగునీరు అందించాకే ఓటు అడుగుతానన్న ఆయన.. అయిదేళ్లు కావస్తున్నా ప్రజలకు నీటికొరత తీర్చలేకపోయారని.. ఇంకా తెలంగాణ పల్లెల్లో అనేకం తాగునీటి సౌకర్యం లేక కటకటలాడుతున్నాయని మోదీ అన్నారు.
కేసీఆర్ కూడా ఒకనాడు యూపీఏ ఉప్పు తిన్న వ్యక్తేనని.. కాంగ్రెస్ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారని మోదీ తెలిపారు. కాంగ్రెస్.. టీఆర్ఎస్ వేరు వేరు కుంపట్లు పెట్టుకోలేదని.. తెలంగాణ ఎన్నికల్లో వారు ఆడుతున్నది కేవలం స్నేహపూర్వకమైన మ్యాచ్ అని.. ఈ రెండు పార్టీలకు కూడా కుటుంబ పాలన మాత్రమే ముఖ్యమని.. తప్పుడు హామీలు ఇవ్వడంలో కూడా ఈ రెండు పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని మోదీ అన్నారు. కనీసం తెలంగాణ సీఎంకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదని.. 5లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత కేవలం బీజేపీదేనని మోదీ అన్నారు.