ఉద్యోగంలోంచి తీసేశాడనే కోపంతో హెచ్ఆర్ బాస్‌పై కాల్పులు

హెచ్ఆర్ బాస్‌పై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి

Last Updated : Jun 8, 2018, 12:49 PM IST
ఉద్యోగంలోంచి తీసేశాడనే కోపంతో హెచ్ఆర్ బాస్‌పై కాల్పులు

తనని ఉద్యోగంలోంచి తొలగించాడనే కోపంతో ఉన్మాదిగా మారిన ఓ మాజీ ఉద్యోగి, నిన్నటి వరకు తాను పనిచేసిన కంపెనీలో మానవ వనరుల విభాగం అధిపతిగా ఉన్న వ్యక్తిపై తుపాకీతో కాల్పులకు పాల్పడి ఘటన గురువారం ఉదయం గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. గురుగ్రామ్ పోలీసు పీఆర్వో రవీందర్ కుమార్ పీటీఐకి వెల్లడించిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లో జపాన్‌కి చెందిన మిచ్‌బిషి కంపెనీ కార్యాలయంలో పనిచేస్తోన్న జోగిందర్ వ్యవహార శైలి బాగో లేదనే కారణంతో సంస్థ అతడిని బుధవారమే ఉద్యోగంలోంచి తొలగించింది. దీంతో తనని ఉద్యోగంలోంచి తొలగించడంపై ఆ సంస్థ మానవ వనరుల విభాగం అధిపతిగా పనిచేస్తోన్న బినేశ్ శర్మపై కసి పెంచుకున్న జోగిందర్.. గురువారం ఉదయం అతడిపై తుపాకీతో దాడికి ప్రయత్నించాడు. ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కి కారులో బయల్దేరిన బినేశ్ శర్మను స్నేహితుడితో కలిసి బైక్‌పై వెంబడించిన జోగిందర్.. అతడికి తుపాకీ చూపించి కారుని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే, ప్రాణభయంతో కారుని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు బినేశ్ శర్మ. దీంతో బినేశ్ శర్మపై మరింత తోపం తెచ్చుకున్న జోగిందర్.. బైక్‌పై నుంచే అతడిపై కాల్పులు జరిపాడు. స్నేహితుడు బైక్ నడిపిస్తుండగా, జోగిందర్ బైక్ వెనకాల కూర్చోని తన మాజీ బాస్‌పై కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో రెండు బుల్లెట్స్ తగిలి గాయాలపాలైన జోగిందర్ శర్మ ప్రస్తుతం రాక్‌లాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బినేశ్ శర్మ ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని, ప్రాణపాయం తప్పిందని రాక్‌లాండ్ ఆస్పత్రి వైద్యులు చెప్పారని రవీందర్ కుమార్ పీటీఐకి తెలిపారు. 

ఉద్యోగంలోంచి తొలగించినప్పుడే జోగిందర్ తనని అంతుచూస్తానని బెదిరించాడని, కానీ అతడి బెదిరింపులని తానే బేఖాతరు చేశానని ఈ దాడిలో గాయపడిన బినేశ్ శర్మ వాపోయారు. కాల్పులు జరిపి పరారైన నిందితుడు జోగిందర్, అతడికి సహకరించిన స్నేహితుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. 

Trending News