న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్‌ల దాఖలుకు గడువును ఈ నెల 31 నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగించినట్టు వచ్చిన వార్తలను ఆదాయ పన్ను శాఖ కొట్టిపారేసింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఐటి శాఖ స్పష్టంచేసింది. 2019-20 పన్ను మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్‌ల గడువు ఆగస్టు 31తోనే ముగుస్తుందని ఆదాయపన్ను శాఖ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఆలోపే తమ రిటర్న్‌లను దాఖలు చేసుకోవాలని సూచించింజి. లేనిపక్షంలో ఆలస్య రుసుంతో వచ్చే ఏడాది మార్చి 31లోగా రిటర్న్‌లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని ఆదాయ పన్ను శాఖ తేల్చిచెప్పింది.
ఆదాయ పన్ను చెల్లింపు నిబంధనల ప్రకారం.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండి వచ్చే ఏడాది మార్చి 31లోపు ఐటి రిటర్న్స్ దాఖలు చేసినవారికి రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటిన వారికి ఈ సంవత్సరం డిసెంబరు 31లోగా రిటర్న్ దాఖలు చేస్తే రూ.5,000, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య ఫైల్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించక తప్పదని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది.