ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి గవర్నర్‌తో భేటీ అయిన కుమారస్వామి

గవర్నర్‌తో భేటీ అయిన కుమారస్వామి

Last Updated : May 16, 2018, 07:09 PM IST
ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి గవర్నర్‌తో భేటీ అయిన కుమారస్వామి

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ సరైన మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 'హంగ్ పాలిటిక్స్' నడుస్తున్నాయి. ఓవైపు అధిక సంఖ్యలో 104 స్థానాలు గెలుచుకున్న తమ పార్టీనే రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేస్తుందని బీజేపీ ధీమా వ్యక్తంచేస్తుండగా మరోవైపు జేడీఎస్ అధినేత హెచ్.డి. కుమారస్వామి సైతం తనకు మద్ధతు ఇస్తోన్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖతో నేటి సాయంత్రం కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం సాయంత్రం  రాజ్ భవన్ చేరుకున్న కుమారస్వామి అక్కడ తనకు వున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని నిరూపించుకున్నారు. 

గవర్నర్‌ని కలిసిన అనంతరం రాజ్ భవన్ వెలుపల కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమకు 117 ఎమ్మెల్యేల మద్ధతు వున్నందున, తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ని కోరినట్టు తెలిపారు. మేజిక్ ఫిగర్ కన్నా అధిక సంఖ్యా బలం వున్నందున సుస్ధిరమైన పాలన అందించేందుకు జేడీఎస్, కాంగ్రెస్ కూటమి సిద్ధంగా వుందని గవర్నర్‌కి విన్నవించామన్నారు. 

తమ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ వాజుభాయ్ వాలా.. '' రాజ్యాంగం ప్రకారం, గత సంఘటనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు'' అని కుమారస్వామి మీడియాకు తెలిపారు.

Trending News