కేరళలో రెడ్ అలర్ట్: 73కు చేరిన మృతుల సంఖ్య

కేరళ రాష్ట్రంలో గత వారంరోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Last Updated : Aug 16, 2018, 12:11 PM IST
కేరళలో రెడ్ అలర్ట్: 73కు చేరిన మృతుల సంఖ్య

కేరళ రాష్ట్రంలో గత వారంరోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు 8 నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా గురువారం 12 మంది మరణించడంతో.. కేరళలో భారీ వర్షాలతో మరణించిన వారి సంఖ్య 73కు పెరిగింది.

కేరళలో భారీ వర్షాల ధాటికి నదులు వరద నీటితో పోటెత్తడంతో..నదీ పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో వరద బాధిత ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అటు రిజర్వాయర్లలో వరద నీరు పోటెత్తడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

 

ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్, కోస్ట్ గార్డ్, ఎన్‌డీ‌ఆర్‌ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను తరలిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అక్కడి పరిస్థితి మెరుగుపడటం లేదు. తాజాగా పంపానదికి వరద నీరు పోటెత్తడంతో.. శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిథి నీట మునిగింది.


 
అటు బుధవారం భారత వాతావరణ శాఖ కేరళకు రెడ్ అలర్ట్ జారీచేసింది. వరద బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. వరద నీరు నిలిచిపోవడంతో కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ను శనివారం వరకు మూసివేశారు. కేరళలో పలు రైలు సర్వీసులు రద్దుకాగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. అటు భారీ వర్షాలతో ఎర్నాకుళం జిల్లాలో అన్ని విద్యాసంస్థలను నేడు, రేపు సెలవు ప్రకటించారు.

ప్రధాని ఆరా

కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వరదలు దురదృష్టకరమని.. కేరళ ప్రజలను ఆదుకుంటామని, అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

 

Trending News