కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రోటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఉత్తర్వులు జారీచేశారు. రేపు శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి, జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మధ్య జరగనున్న బల పరీక్షను ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ అయిన కేజీ బోపయ్య పర్యవేక్షించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4 గంటలకు బల పరీక్ష నిర్వహించి బీజేపీ తమ మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్ర సర్కార్ ఈ బల పరీక్షకు వెళ్తోంది. ప్రొటెమ్ స్పీకర్ కేజీ బోపయ్య పర్యవేక్షణలో రాజ్యాంగం ప్రకారం జరగనున్న ఈ బల పరీక్షలో నెగ్గిన వారికే కర్ణాటక సీఎం సీటు దక్కనుంది.
కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానం మేరకు బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవాలంటే రేపు జరగనున్న బల పరీక్షలో మెజార్టీని నిరూపించుకోవాల్సి వుంటుంది. లేనిపక్షంలో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది.
అయితే, తమకే 116 మంది ఎమ్మెల్యే మద్దతు వుందని చెబుతూ వస్తోన్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సైతం ఈ బల పరీక్షలో ఎలాగైనా నెగ్గి అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిందేనని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు ఎవ్వరూ, ఎటువంటి సంప్రదింపులు జరపకుండా వారిని హైదరాబాద్ తరలించి అక్కడున్న రెండు హోటల్స్‌లో బస ఏర్పాటు చేశారు జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అగ్రనేతలు.