ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో భద్రతా దళాలు ఎనిమిది మంది తీవ్రవాదులను హతమార్చారు. షోపియాన్ జిల్లా డ్రగాద్ గ్రామంలో ఏడుగురు తీవ్రవాదులను మట్టుబెట్టగా.. అనంత్‌నాగ్‌లోని దియాల్గమ్‌లో మరో తీవ్రవాదిని హతమార్చారు. కాగా, ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నారు. చనిపోయిన తీవ్రవాదులు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందినవారిగా గుర్తించారు. షోపియాన్ జిల్లా కచ్‌దూరలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
షోపియాన్ జిల్లా డ్రగాద్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్ స్థలంలో ఏడుగురు తీవ్రవాదులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని జమ్మూ మరియు కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఎస్పీ వైద్ చెప్పారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు గాయపడ్డారని చెప్పారు.
#SpotVisuals: Encounter underway between security forces and terrorists in Kachdoora area of Shopian. More details awaited #JammuAndKashmir (visuals deferred by unspecified time) pic.twitter.com/K5AWPLzARj
— ANI (@ANI) April 1, 2018
అనంత్‌నాగ్‌లోని దియాల్గమ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన రౌఫ్ ఖండే అనే తీవ్రవాది మరణించాడు. ఇమ్రాన్ రషీద్ అనే మరో తీవ్రవాదిని ప్రాణాలతో పట్టుకుని అరెస్టు చేశారు. 4-5 మంది తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు భావించిన భద్రతాదళాలు షోపియాన్‌లోని కచ్దూర ప్రాంతంలో గస్తీ నిర్వహించగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
"అనంత్‌నాగ్‌లో ఓ తీవ్రవాది చనిపోయాడు. మరో తీవ్రవాదిని సజీవంగా పట్టుకున్నాం. షోపియాన్ జిల్లా డ్రగాద్, కచ్దూర ప్రాంతంలో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. డ్రగాద్‌లో ఏడుగురు తీవ్రవాదుల మృతదేహాలతో పాటు భారీ మొత్తం ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం"అని డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. షోపియాన్ ఎన్‌కౌంటర్ ఘటన స్థలంలో కొందరు పౌరులు చిక్కుకున్నట్లు, వారిని కాపాడటానికి ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు.
ఈ సంఘటనల తరువాత దక్షిణ కాశ్మీర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. లోయలో బారాముల్లా మరియు జమ్మూ ప్రాంతంలోని బన్నిహల్ మధ్య రైల్ సర్వీసులను కూడా రద్దు చేశారు.