ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమారుడు, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌లకు ఊరట లభించింది. శుక్రవారం ఉదయం రబ్రీదేవి, తేజస్వి యాదవ్ పాటియాలా కోర్టుకు హాజరుకాగా.. కోర్టు వారికి బెయిలు మంజూరు చేసింది. వీరితో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరికీ పటియాలా కోర్టు బెయిలిచ్చింది. నిందితులందరికీ రూ.లక్ష బాండ్, ష్యూరిటీ కింద కోర్టు బెయిలిచ్చింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనను అక్టోబర్ 6న కోర్టుకు హాజరయ్యేలా ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయాలని పటియాలా కోర్టు ఆదేశించింది.
ఐఆర్సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ కేసు నమోదు చేసింది. రాంచి, పూరీలోని ఐఆర్సీటీసీ హోటళ్లను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఐఆర్సీటీసీ నిర్వహించే రెండు హోటళ్లను సుజాతా హోటల్స్ అనే ప్రవేట్ సంస్థకు కట్టబెడుతూ ప్రతిఫలంగా పాట్నాలో బినామీ కంపెనీ పేరుతో మూడు ఎకరాల అత్యంత విలువైన స్థలాన్ని (సుమారు రూ.45 కోట్లు) పొందారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు హోటళ్లను క్విడ్ ప్రోకో కింద ఆ సంస్థకు అప్పగించినట్లు.. టెండర్ దక్కగానే ఆ స్థలం లాలూ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.
మరోవైపు దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో సరెండర్ కాగా.. ఆయన్ను బిర్సా ముండా జైలుకు తరలించారు.