తత్కాల్ టికెట్ క్సాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు పూర్తి డబ్బులు తిరిగి చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) త్వరలోనే ఈ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన విధి, విధానాలను రూపొందించే పనిలో నిమగ్నమై వుంది. అయితే, ఈ సౌకర్యం వర్తించడానికి పలు షరతలు వర్తించనున్నాయి. తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్న రైలు నిర్ణీత సమయానికన్నా 3 గంటలు ఆలస్యంగా స్టేషన్కి రానున్న పక్షంలో టికెట్ క్యాన్సిల్ చేసుకునే వారికి మాత్రమే ఈ 100 శాతం రిఫండ్ వర్తిస్తుంది. అంతేకాకుండా ఏదైనా కారణాల వల్ల మరో మార్గం గుండా రైలుని దారి మల్లించినా లేదా గమ్యస్థానం స్టేషన్ మారినా లేదా ప్రయాణికుడు / ప్రయాణికురాలు బుక్ చేసుకున్న విధంగా బెర్త్ కల్పించడంలో సిబ్బంది విఫలమైన సందర్భాల్లో తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసుకునే వారికి కూడా ఈ పూర్తి నగదు వాపసు వర్తించనుంది.
ఇవేకాకుండా ప్రయాణికులు బుక్ చేసుకున్న క్లాస్ కన్నా తక్కువ క్లాస్లో బెర్త్ కేటాయించిన పక్షంలోనూ సదరు ప్రయాణికులు తమ టికెట్ క్యాన్సిల్ చేసుకుని పూర్తి నగదు తిరిగి పొందే వెసులుబాటు కల్పించేందుకు ఇండియన్ రైల్వైస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఐఆర్సీటీసీ నిబంధనలు రూపొందించడం పూర్తయిన తర్వాత ఈ సరికొత్త తత్కాల్ టికెట్ క్యాన్సిలింగ్ విధానం అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.