చెన్నై: భారతీయులంత అమాయకులను తాను మరెక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యానించారు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు తాము అంత చేశాం, ఇంత చేశామని చెప్పే ప్రతి మాటల్ని ప్రజలు నమ్మేస్తారని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్తు అందించామని చెబితే నమ్మేస్తారని, అదే విధంగా దేశంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్లను నిర్మించామని చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మేస్తారని కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటించారు.
పత్రికల్లో కనిపించిన ప్రతి వార్త నిజమని సైతం భారతీయులు నమ్మేస్తారని, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకంలోనూ అదే జరిగిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి చెందిన తన క్యాబ్ డ్రైవర్ తండ్రికి జరిగిన ఘటనను వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ట్రీట్ మెంట్ చేపించాలని విఫలమయ్యారని గుర్తుచేశారు.
‘ఆయుష్మాన్ కార్డు తీసుకుని డ్రైవర్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ వైద్యులకు కార్డు చూపించి ఆపరేషన్ చేయాలని డ్రైవర్ కోరాడు. కానీ తమకు అలాంటి కార్డుల గురించి, పథకం గురించి అవగాహన లేదని పంపేశారు. కానీ దేశమంతా ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందని, అన్ని వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయినా ప్రజలు దీన్ని గుడ్డిగా నమ్ముతున్నారంటూ’ కేంద్ర ప్రభుత్వ ప్రచారాలను చిదంబరం విమర్శించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..