Maharashtra Police: మహారాష్ట్రలో పోలీసులకు సెలవులు రద్దు చేశారు. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోలీసు విభాగం సర్వ సన్నద్ధంగా ఉందని మహారాష్ట్ర డీజీపీ రజనీష్ సేథ్ స్పష్టం చేశారు. హనుమాన్ చాలీసా పఠిస్తామనే వ్యవహారమే ఈ పరిణామాలకు కారణమయ్యింది.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే బుధవారం నుంచి తన కార్యాచరణ ప్రారంభించనున్నట్లు అల్టిమేటం జారీచేశారు. మహారాష్ట్ర బలం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తానని ప్రకటించారు. దీంతో, మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. పోలీసు డిపార్ట్‌మెంట్ ముందస్తు చర్యలు చేపట్టింది.
మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే అంతకు రెట్టింపు శక్తితో తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో రంజాన్ పర్వదినం వచ్చింది. రంజాన్ సందర్భంగా రాజ్‌ఠాక్రే ఆశ్చర్యకర ప్రకటన చేశారు. మే ౩వ తేదీన ఈద్ పండుగ ఉందని, ముస్లింల సంబరాలను చెడగొట్టే ఉద్దేశ్యం తనకు లేదని, వాళ్లను పండుగ చేసుకోనివ్వండని ప్రకటించారు. కానీ, ఈద్ మరుసటిరోజు తన కార్యాచరణ మొదలవుతుందని, మే 4వ తేదీ తర్వాత ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని, తమ డిమాండ్ నెరవేర్చకుంటే హనుమాన్ చాలీసాను రెట్టింపు శక్తితో పఠిస్తామని స్పష్టం చేశారు. తమ విన్నపం ప్రభుత్వానికి అర్థం కాకుంటే తమకు తెలిసిన మార్గంలో పరిష్కరించుకుంటామని, తాను మౌనంగా ఉండే అవకాశమే లేదని, మహారాష్ట్ర బలమేంటో చూపిస్తానని ట్విట్టర్ వేదికగా తీవ్రమైన అల్టిమేటం జారీచేశారు.
రాజ్‌ఠాక్రే ప్రకటనతో మహారాష్ట్ర పోలీసు విభాగం అప్రమత్తమయ్యింది. పోలీసుల సెలవులన్నింటినీ డీజీపీ రద్దు చేశారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు తమ యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉందని డీజీపీ రజనీష్ సేథ్ చెప్పారు రాజ్‌ఠాక్రేపై అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమన్నారు. ప్రశాంతతకు భంగం కలిగించాలని ఎవరు చూసినా కఠిన చర్యలు తప్పవన్నారు.
అంతేకాదు.. శాంతి భద్రతలకు సంబంధించిన ఎలాంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనే సత్తా మహారాష్ట్ర పోలీసులకు ఉందన్నారు డీజీపీ. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది అందరికీ సెలవులను రద్దుచేశామన్నారు. 87 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు తోడు.. 30 వేల మంది హోంగార్డులను రాష్ట్రవ్యాప్తంగా మోహరించామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులదే అని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
అయితే, రంజాన్ పండుగకు ముందు రోజే మహారాష్ట్ర పోలీసులు యాక్ట్ మొదలెట్టేశారు. మే 2వ తేదీన ఔరంగాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో రాజ్‌ఠాక్రేతో పాటు.. మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు.. 14 సంవత్సరాల క్రితం రాజ్‌ఠాక్రేపై నమోదైన ఓ కేసులో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ సైతం జారీచేశారు.
ఇక, రాజ్‌ఠాక్రే అల్టిమేటంపై మహారాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. రాజ్‌ఠాక్రే వెనుక బీజేపీ ఉందని మహావికాస్ అఘాఢీలో భాగమైన శివసేన పార్టీ ఆరోపిస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత్వం సృష్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ అధికారం కోల్పోవడంతో ఈ కుటిల యత్నాలు చేస్తోందని శివసేన మండిపడుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Also Read: మసీదులపై మైకులు వాడొద్దు : జావేద్ అక్తర్
Also Read: Abortion law in America: అమెరికాలో అబార్షన్ చట్టం రద్దు కానుందా? తీర్పు ఇవ్వబోతున్న సుప్రీంకోర్టు!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook