అటల్ బిహారి వాజ్‌పేయి గౌరవార్థం 7 రోజులు సంతాప దినాలు 

అటల్ బిహారి వాజ్‌పేయి గౌరవార్థం 7 రోజులు సంతాప దినాలు 

Last Updated : Aug 17, 2018, 02:07 PM IST
అటల్ బిహారి వాజ్‌పేయి గౌరవార్థం 7 రోజులు సంతాప దినాలు 

మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి నేటి సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు సంతాప దినాలను పాటించాలని కేంద్రం ప్రకటించింది. జాతీయ సంతాప దినాలలో భాగంగా నేటి నుంచి 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వపరమైన వినోద కార్యక్రమాలపై నిషేదాజ్ఞలు అమలులోకి వస్తాయి. 

 

 

ఇదిలావుంటే, రేపు ఉదయం 9 గంటలకు వాజ్‌పేయి పార్థివదేహాన్ని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పించి ఆయన్ను కడసారి చూసుకునేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుందని... అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాకు తెలిపారు. రేపు సాయంత్రం 4 గంటలకు స్మృతి స్థల్‌లో వాజ్‌పేయి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు అమిత్ షా స్పష్టంచేశారు.

 

 

మాజీ ప్రధాని వాజ్‌పేయి పరమపదించిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 

Trending News