ఢిల్లీ : పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దేశ రాజధాని ఢిల్లీకి వచ్చినట్టు కేంద్ర నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్ నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి భారత్‌లోని వేర్వేరు ప్రాంతాలకు వచ్చారని.. ఇందులో భాగంగానే ఢిల్లీకి నలుగురు ఉగ్రవాదులు వచ్చారని కేంద్ర నిఘా విభాగానికి సమాచారం అందింది. కేంద్ర నిఘావర్గాలకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఏ క్షణమైనా దాడులు చేయవచ్చని తెలుస్తోంది.
కేంద్ర నిఘావర్గాలు అందించిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. ప్రముఖులు, ప్రజల రద్దీ అధికంగా ఉండే పలు ప్రధాన ప్రాంతాల్లో సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నారు. అనుమానమున్నవారిని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
బుధవారం జారీ అయిన హెచ్చరికలతో ఢిల్లీలోనే కాకుండా జమ్మూకశ్మీర్, అవంతిపూర్, పటాన్ కోట్, హిందోన్ వైమానిక స్థావరాల్లోనూ కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన జవాన్లు, ఢిల్లీ పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు.
పాకిస్తాన్ నుంచి ఢిల్లీకి నలుగురు ఉగ్రవాదులు