గుజరాత్ పోరు: కాంగ్రెస్ vs పాటీదార్

కాంగ్రెస్- పాటీదార్ల మధ్య సీట్ల కేటాయింపులపై ఆదివారం అర్థరాత్రి గొడవ జరిగింది. కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసం అయ్యింది. నేడు మద్దతుపై హార్దిక్ స్పష్టత.

Last Updated : Nov 20, 2017, 01:41 PM IST
    • అర్ధరాత్రి కాంగ్రెస్-పాటీదార్ల మధ్య కొట్లాట
    • సీట్ల కేటాయింపులో అన్యాయం
    • మద్దతుపై పునరాలోచిస్తాం
గుజరాత్ పోరు: కాంగ్రెస్ vs పాటీదార్

దేశమంతా చలికి రగ్గులు, బెడ్ షీట్లు కప్పుకుంటుంటే.. గుజరాత్ మాత్రం వేడి తట్టుకోలేక సెగలు కక్కుతోంది. అర్థం కాలేదా? గుజరాత్ లో ఎన్నికలు కదా.. అక్కడ రాజకీయ నాయకులకు చెమటలు పడుతున్నాయ్. యావత్ దేశం దృష్టి అంతా ఇప్పుడు ఆ రాష్ట్రం మీదే.. డిసెంబర్ 8,9 తేదీల్లో గుజరాత్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 

రెండు దశాబ్దాలుగా పీఠం మీదున్న బీజేపీని గద్దె దించాలని భావిస్తూ.. కాంగ్రెస్ బీజీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ తో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మద్దతిచ్చాడు. తీరా కట్ చేస్తే ఆదివారం కాంగ్రెస్ సీట్ల జాబితాను ప్రకటించింది. అందులో తమ వర్గానికి మూడే సీట్లు కేటాయించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన పాటీదార్లు సూరత్ లోని కాంగ్రెస్ కార్యాలయంపై అర్థరాత్రి దాడి చేశారు.

ఈ క్రమంలో పాటీదార్లు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటా మాటా పెరిగి చివరకు కొట్లాటకు దారితీసింది. తమకు టికెట్ల విషయంలో అన్యాయం జరిగిందని పాటీదార్ల వాదన. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో కాంగ్రెస్ కు తాము 20 స్థానాలు కేటాయించాలని కోరగా, ఓబిసి నేత ఆల్పేస్ ఠాకూర్  12 స్థానాలు ఇవ్వాలని కోరారు. ఈ ఒప్పందంతోనే మేము కాంగ్రెస్ కు మద్దతునిచ్చాము అన్నారు.

కాగా, పాటీదార్ల వర్గం కాంగ్రెస్ పై ఎదురుదాడికి సిద్ధమైంది. మేము కాంగ్రెస్ కు మద్దతిచ్చే అంశంపై పునరాలోచిస్తాం. ముందు కాంగ్రెస్ తమ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారో తేల్చాలి. ఆ విషయం తేలాకే పొత్తు పై నిర్ణయం తీసుకుంటాం.. అని దినేష్ పటేల్ మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చే అంశాలను సోమవారం రాజ్ కోట్ లో జరిగే ప్రచార సభలో తమ అధినేత హార్దిక్ పటేల్ స్పష్టత ఇస్తారని దినేష్ చెప్పారు. 

 

 

Trending News