Max Review: మాక్స్ మూవీ రివ్యూ.. కిచ్చా సుదీప్‌ సినిమా ఎలా ఉందంటే..?

Max Review and Rating: ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ.. హీరో కిచ్చా సుదీప్. ఈ హీరోకి ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందించింది. అయితే ఈమధ్య అన్ని భాషల హీరోలు తెలుగులో ఎంతటి మార్కెట్ తెచ్చుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో సుదీప్ మార్కెట్ మాత్రం.. తెలుగులో కేవలం యవరేజ్ గానే ఉంది. అయితే సూపర్ సక్సెస్ అందుకుంటే.. ఈ మార్కెట్ కాస్త పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో మాక్స్ సినిమాతో వచ్చిన ఈ హీరో.. తెలుగు ప్రేక్షకులను మెప్పించారా లేదా ఒకసారి చూద్దాం 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 26, 2024, 08:48 PM IST
Max Review: మాక్స్ మూవీ రివ్యూ.. కిచ్చా సుదీప్‌ సినిమా ఎలా ఉందంటే..?

Kichha Sudeep Max Review: కిచ్చా సుదీప్ హీరోగా క్రిస్మస్ సందర్భంగా.. విడుదలైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాక్స్. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఒకసారి చూద్దాం. 

కథ
ముక్కుసూటిగా, నిజాయితీతో ఎవరికి భయపడకుండా వ్యవహరించే.. పోలీస్ అధికారి అర్జున్ అలియాస్ మాక్స్ (కిచ్చా సుదీప్). సస్పెన్షన్‌లో ఉన్న మాక్స్.. మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు. అయితే మాక్స్ కొత్త డ్యూటీకి చేరే ఒక్క రాత్రిలోనే అనేక సంఘటనలు.. చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు అడుగు పెట్టే ముందు, మంత్రుల కొడుకుల్ని అరెస్ట్ చేసి లోపల వేస్తాడు. ఒకపక్క..ఈ మంత్రులు అప్పటికే సీఎంను పదవి నుంచి దించేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. కానీ పోలీస్ స్టేషన్‌లో ఆ ఇద్దరూ చనిపోతారు. ఈ మంత్రుల కొడుకుల మరణం వెనుక అసలు కథ ఏంటి? ఈ కేసు నుంచి బయటపడేందుకు పోలీసులు ఏ రకమైన యత్నాలు చేశారు? 

ఈ కథలో క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రూపా (వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని (సునిల్) పాత్రలు ఎంత ముఖ్యమైనవి? చివరికి, మాక్స్ తన సహచర పోలీసుల్ని రక్షించేందుకు ఏం చేశాడు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫామెన్స్:

కిచ్చా సుదీప్ తన పాత్రలో జీవించాడు. యాక్షన్ హీరోగా తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. తలవంచని, న్యాయం కోసం పోరాడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించాడు. యాక్షన్ సన్నివేశాలు.. అతడి అభిమానులకు నిజమైన పండగగా నిలిచాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ ఆకట్టుకునే పాత్రలో కనిపించింది. సునీల్ పాత్ర మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. ఇక ఇళవరసు మరోమారు మంచి పాత్రను దక్కించుకున్నారు. 

టెక్నికల్ సిబ్బంది పనితీరు:

టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు మద్దతుగా నిలిచింది. కథ మొత్తం రాత్రి సమయంలో, ఒకే లోకేషన్‌లో సాగినా కూడా.. కెమెరా పనితనం విసుగుని దూరం చేసింది. అజనీష్ సంగీతం మరింత ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా అనిపిస్తే, కొన్ని చోట్ల అది మరింత మించిందనే భావన కలుగుతుంది. మాటలు బాగా రాసుకున్నారు, కానీ పాటలు పెద్దగా గుర్తుండిపోవు. అవి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో కలిసిపోయినట్లు అనిపిస్తాయి. తక్కువ ఖర్చుతో తెరకెక్కించినా..రిచ్ లుక్స్ ఇచ్చి గ్రాండియర్‌గా చూపించారు.

విశ్లేషణ

మాక్స్ సినిమాను చూస్తే దర్శకుడు.. లోకేష్ కనకరాజ్ ప్రభావం కనిపించడం ఖాయం. ముఖ్యంగా ఖైదీ, విక్రమ్ వంటి చిత్రాల శైలిని ఈ సినిమాలో చూశామనే భావన కలుగుతుంది. మొత్తం కథ.. పోలీస్ స్టేషన్ ఆధారంగా నడుస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయబడింది. ఒక చిన్న పాయింట్‌నే తీసుకుని, దాన్ని ఇలా గ్రిప్పింగ్‌గా కథలో మలచిన దర్శకుడి.. ప్రతిభకు మెచ్చుకోకుండా ఉండలేము.  

మాస్ ఆడియెన్స్‌ను మెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై మోమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. థ్రిల్ కోరుకునే ప్రేక్షకులకు తగిన ట్విస్టులు.. కూడా ఉంటాయి. కొన్ని చిన్న ట్విస్టులు ఊహించగలిగినవే అయినా, వాటిని కొత్త కోణంలో చూపించడం.. దర్శకుడి ప్రత్యేకత. ఇంకా, కథలో సామాజిక సందేశం కూడా చేర్చి.. దాన్ని చక్కగా చెప్పారు. అన్ని కోణాలను కలిపి, దర్శకుడు చిత్రానికి బలమైన పునాది అందించారు.  

సినిమా ఆరంభం చాలా బాగా ఉంటుంది, ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్ బావుంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత, సెకండ్ హాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసలు ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా బయటపడతారు? నిజం బయటపడితే పరిస్థితి ఎలా ఉంటుందనే.. ఆసక్తితో ప్రేక్షకులు క్లైమాక్స్ వరకు కూర్చునేలా కథను ముందుకు నడిపారు.

ప్రీ-క్లైమాక్స్ దగ్గర అసలు ట్విస్ట్ కనిపిస్తుంది, ఇది కొంతవరకు ప్రేక్షకులు ఊహించగలిగేలా ఉంటుంది. అయితే క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఖైదీ, విక్రమ్ స్థాయిలో కనిపించి ఆకట్టుకుంటుంది. మూవీలో డైలాగులు, కొన్ని సన్నివేశాలు చూస్తే, ఈ కథకు ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కలుగుతుంది. ప్రత్యేకంగా మాక్స్ పాత్రను చూపించేందుకు వినిపించిన డైలాగ్‌లు, ఒక్కో ట్రాన్స్‌ఫర్ వెనుక ఒక్కో కథ ఉందనే రీతిలో హీరోని.. ఎలివేట్ చేసిన తీరు, మాక్స్ గతం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రేక్షకుల ఊహలకు వదిలేస్తాయి. సినిమా విజయవంతమైన నేపథ్యంలో, ప్రీక్వెల్ లేదా సీక్వెల్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

రేటింగ్: 3/5

Also Read: TFI meet with Revanth Reddy: టాలీవుడ్ ఇవి పాటించాల్సిందే.. సీఎం మీటింగ్ లో ఏం చెప్పారంటే..!

Also Read: TFI Meets Revanth Reddy: సినీ ప్రముఖుల ప్రతిపాదనలు.. సీఎం ఏమన్నారంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News