ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లుల అమలు

జీఎస్‌టీ కౌన్సిల్ 26వ సమావేశం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ముగిసింది.

Last Updated : Mar 10, 2018, 08:47 PM IST
ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లుల అమలు

శనివారం వస్తు మరియు సేవల పన్ను(జీఎస్‌టీ కౌన్సిల్) మండలి 26వ సమావేశం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ముగిసింది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు, ఆర్థిక నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాలను నాలుగు భాగాలుగా వర్గీకరించి అంతర్ రాష్ట్ర వస్తువుల సరఫరాపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ-బిల్లులను ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

"అంతర్ రాష్ట్ర వస్తువుల సరఫరాపై, ఈ-బిల్లుల విధానం ఏప్రిల్ 1, 2018 నుండి అమలవుతుంది. ఆ తర్వాత, రాష్ట్రాలను నాలుగు భాగాలుగా వర్గీకరించి ఇంట్రా స్టేట్ ఈ-బిల్లును అమలు చేస్తారు. ఒక వారం తరువాత, దశలవారీగా విధానం అమలులోకి వస్తుంది. ఏప్రిల్‌లోగా రాష్ట్రాలను వర్గీకరించే ప్రక్రియను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తాము' అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.  జూన్ ఒకటికల్లా అన్ని రాష్ట్రాలకు ఈ-బిల్లులను తీసుకువస్తామని జైట్లీ వెల్లడించారు. సమావేశంలో జీఎస్టీ రిటర్న్స్ దాఖలును మరో మూడు నెలల పాటు పొడిగించినట్లు తెలిపారు.

సులభమైన జీఎస్‌టీ రిటర్న్ ఫారాన్ని తయారుచేయడంపై ఈ 26వ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. దీనికోసం సుశీల్ మోదీ నేతృత్వంలో ఓ మినిస్టీరియల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఎగవేతలను అరికట్టడంతో పాటు ఒక పేజీలోనే ఈ ఫారం ఉండేలా రూపొందించాలని ప్రతిపాదించారు. ఎగుమతిదారులకు పన్ను మినహాయింపులను కూడా ఆరునెలలు వరకు పొడిగించారు.

Trending News