ఇండియన్ సైంటిస్టుకు గూగుల్ గౌరవం

                 

Last Updated : Oct 19, 2017, 07:24 PM IST
ఇండియన్ సైంటిస్టుకు గూగుల్ గౌరవం

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌.. నోబెల్ పురస్కారం పొందిన భారతీయ శాస్త్రవేత్త. నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నందుకుగాను ఆయన విలియమ్ ఏ ఫౌలర్ అనే అమెరికన్ న్యూక్లియర్ సైంటిస్టుతో కలిసి నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. ఈ రోజు ఆయన 107వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ సంస్థవారు డూడుల్ విడుదల చేశారు. చంద్రశేఖర్ ప్రఖ్యాత శాస్త్రవేత్త సివి రామన్‌కు స్వయానా మేనల్లుడు. లాహోర్‌లో 19 అక్టోబరు, 1910 తేదీన ఓ తమిళ కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివారు. 

పదిహేను సంవత్సరాల పిన్న వయస్సులోనే, ఇంకా విద్యార్థిగా ఉండగానే, తన మొట్టమొదటి పరిశోధనా పత్రం 1929 లో ప్రచురించారు.ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధకుడిగా వ్యవహరిస్తున్న కాలంలో ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’గా పిలిచే తన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు.

ప్రతి మనిషి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలున్నట్టే, నక్షత్రాల్లో కూడ పరిణామ దశలుంటాయి. అరుణ మహాతార (రెడ్‌ జెయంట్‌), శ్వేత కుబ్జ తార ( వైట్‌డ్వార్ఫ్‌), బృహన్నవ్య తార (సూపర్‌నోవా),  కృష్ణ బిలం (బ్లాక్‌హోల్‌) అనే దశలు ప్రముఖమైనవి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్‌ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ పొందారు.

 

Trending News