ఎటువంటి భయాందోళనలు లేకుండా.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అతని కుమారుడి వివాహం జరుపుకోవచ్చని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్పష్టం చేశారు. అంతకు ముందు ఔరంగాబాద్ లో జరిగిన ఒక సభలో తేజ్.. పెళ్లిలో గొడవలు సృష్టిస్తామని చెప్పడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో.. దానిపై ఆయన పైవిధంగా స్పందించారు. "నేనేమీ క్రిమినల్ ను కాదు. ఆయన తన కొడుకు పెళ్లి ఎటువంటి భయం లేకుండా జరిపించవచ్చు. నా నుంచీ, నా కార్యకర్తల నుంచి గానీ వివాహ వేడుకల్లో గొడవలు రావు" అని చెప్పారు.
ఇదివరకు తేజ్ గొడవలు పెళ్లిలో సృష్టిస్తామని సభలో చెప్పడంతో బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కుమారుడు ఉత్కర్ష్ వివాహ వేడుకను రాజేంద్రనగర్ షఖ మైదానం నుండి భద్రతాకారణాల దృష్ట్యా పాట్నా విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వెటర్నరీ గ్రౌండ్స్ కు మార్చారు.
కాగా.. డిప్యూటీ సీఎం తన కుమారుడి పెళ్ళికి కట్నం తీసుకోవటం లేదని అన్ని వార్తా పత్రికల్లో ప్రచురించాడు. వివాహం నిరాడంబరంగా జరగబోతున్నది. పెళ్లిలో గానాబజానాలు, విందు వంటి ఆర్భాటాలెవీ ఏర్పాటు చేయటం లేదు. పెళ్లి పత్రికలను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా అతిథులకు పంపారు. స్ఫూర్తినిచ్చేలా కుమారుడి వివాహం జరిపిస్తున్నట్లు చెప్పారు మోదీ.