న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాదార్లకు కేంద్రం తీపికబురు అందించనుంది. జనధన్ ఖాతాదార్లకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రసంగంలో ప్రకటించనున్నారు.
దేశంలో ప్రస్తుతం 32 కోట్ల మందికి జన్‌ధన్ ఖాతాలుండగా..వీరికి జీవిత బీమా పరిహారం కింద రూ.30 వేలు చెల్లిస్తున్నారు. రూపే కార్డు వాడుతున్న ఖాతాదార్లకు ప్రమాద బీమా కింద రూ.లక్ష ఇస్తారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.2లక్షల వరకు ఇన్సూరెన్స్ చెల్లిస్తారు. ఇదే తరహాలో.. ప్రభుత్వమే ఆ రూ.12 చెల్లించి.. రూపే కార్డు ఉన్నా లేకున్నా జన్‌ధన్ ఖాతాదారులందరికీ ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించి సురక్ష బీమా యోజన కిందకు తీసుకురావాలని మోదీ సర్కార్ ఆలోచిస్తోంది.
అయితే.. జన్‌ధన్ ఖాతాదారులు మూడు నెలల్లో కనీసం ఒక్కసారైనా రూపే కార్డును వినియోగించి ఉండాలన్న నిబంధన ఉండగా, దాన్ని తొలగించాలని కూడా ప్రతిపాదించింది. ఖాతాదార్లకు ప్రస్తుతం ఇస్తున్న జీవిత, ప్రమాద బీమా పరిహారాన్ని రెట్టింపు చేయాలని కూడా కేంద్రం యోచిస్తోందని సమాచారం.