Passenger Caught Smoking in Air India Flight: ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు కూడా బస్సుల్లో, రైళ్లలో గొడవల మాదిరిగానే అనేక ఘర్షణలు చోటుచేసుకుంటున్నారు. విమానాల్లో ప్రయాణికులు ఒకరిపై మరొకరు చేయి చేసుకోవడం లేదా ఏకపక్షంగా దాడులు చేయడం, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణం అయ్యాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో కూడా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణీకుడు విమానం వాష్ రూమ్‌లో సిగరెట్ తాగి రచ్చరచ్చ చేయడమే కాకుండా విమానం సిబ్బందితో పాటు తోటి ప్రయాణీకులపై దాడి చేసిన ఘటన జులై 8న టొరంటో నుండి ఢిల్లీకి వస్తోన్న విమానంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలోని లావెటరీ డోర్ ధ్వంసమైంది అని ఎయిర్‌లైన్స్ బుధవారం మీడియాకు తెలిపింది. క్యాబిన్ క్రూ అందించిన ఫిర్యాదు మేరకు ఎయిర్ ఇండియా విమానం ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే దాడికి పాల్పడిన వ్యక్తిని అక్కడి భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్ ఇండియా విమానంలో దాడికి పాల్పడిన వ్యక్తిని నేపాల్ పౌరుడిగా గుర్తించారు. జూలై నాడు టొరంటో నుంచి ఢిల్లీకి బయల్దేరిన AI188 విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నాడు. ఫ్లైట్ లావేటరీలో స్మోకింగ్ చేయడమే కాకుండా, లావేటరీ డోర్ ని ధ్వంసం చేశాడు. అడ్డం వచ్చిన సిబ్బంది, ప్రయాణీకులపైనా దాడికి పాల్పడ్డాడు. నిందితుడి దాడిలో సిబ్బందికి, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి" అని ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
" ప్రయాణీకుడిని తమ సిబ్బంది చాలాసార్లు హెచ్చరించారని.. అయినప్పటికీ అతడు మాట వినిపించుకోకుండా ఘర్షణ పడ్డాడని.. చివరకు అతడిని అతడి సీటులోనే కూర్చోబెట్టి నిలువరించవలసి వచ్చింది " అని ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పుకొచ్చారు.
నిబంధనల ప్రకారం విమానం విమానాశ్రయం చేరుకోవడంతోనే సదరు ప్రయాణీకుడిని భద్రతా అధికారులకు అప్పగించాం. అంతేకాకుండా ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తమ ప్రకటనలో పేర్కొన్నారు.