కొత్తగా పెళ్లయి ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన కోడలికి తొలిరోజే షాక్ ఎదురైంది. అత్తగారింట్లో మరుగుదొడ్డి లేదని తెలుసుకున్న ఆ కోడలు.. ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించే వరకు అత్తగారింటికి వచ్చేది లేదని షరతు విధించి అమ్మగారింటికి వెళ్లిపోయింది. పేదరికంతో సతమతమవుతున్న ఆ అత్తామామలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగని కోడలిని కూడా తప్పు పట్టలేకపోయారు. మరుగుదొడ్డి లేని ఇంటికి ఎలా రావాలని కోడలు షరతు విధించడంలో ఎటువంటి తప్పులేదని భావించిన మామగారు.. చివరకు తనకు వ్యవసాయంలో ఎంతో అండగా ఉన్న జోడు ఎద్దులను విక్రయించడానికే సిద్ధపడ్డారు. అలా రెండు ఎద్దులను విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించి కోడలి కోరికను నెరవేర్చాడు. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మరుగుదొడ్డి ఆవశ్యకతను మరోసారి చాటిచెప్పింది.
ఇదిలావుంటే, మరుగుదొడ్డి ఆవశ్యకతపై అందరికీ అర్థమయ్యేలా తెలియచెప్పిన కోడలిని సైతం అందరూ అభినందిస్తున్నారు. నలుగురుకి ఆదర్శంగా నిలిచిన ఆ యువతికి ప్రస్తుతం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.