Fake vaccines scam: ముంబై: కరోనావైరస్ వ్యాప్తితో జనం అష్టకష్టాలు పడుతుంటే.. మరోవైపు కొంతమంది మోసగాళ్లు మాత్రం కరోనాను కూడా సొమ్ము చేసుకుంటూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్లకు ఏర్పడిన డిమాండుని అడ్డం పెట్టుకుని నకిలీ వ్యాక్సిన్లతో అమాయకులను మోసం చేస్తున్నారు. ముంబైలోని కాండివలిలో ఉన్న హిరానందని ఎస్టేట్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సొసైటీలో నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఫేక్ వ్యాక్సిన్స్ ఇచ్చారని తెలిసి అక్కడ వ్యాక్సిన్ తీసుకున్న 390 మంది, వారి కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కొవీషీల్డ్ వ్యాక్సిన్ (Covishield vaccines) అని చెప్పి ఫేక్ వ్యాక్సిన్ ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఫేక్ వ్యాక్సిన్ (Fake vaccines) ఘటన వివరాల్లోకి వెళ్తే.. రాజేష్ పాండే అనే వ్యక్తి సొసైటీ ప్రతినిధులను కలిసి తాము కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్ నుంచి వచ్చామని నమ్మించి సొసైటీ వాసులను వ్యాక్సిన్ తీసుకునే ఒప్పించాడు. ఈ మొత్తం వ్యవహరాన్ని సంజయ్ గుప్త అనే మీడియేటర్ కోఆర్డినేట్ చేయగా.. మహేంద్ర సింగ్ అనే వ్యక్తి వచ్చి వారి నుంచి ఒక్కో వ్యాక్సిన్‌కి రూ. 1260 చొప్పున డబ్బులు వసూలు చేశాడు. రాజేష్ పాండే టీమ్ వచ్చి వ్యాక్సిన్లు వేసి వెళ్లింది. కానీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎవ్వరికీ వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా ఎలాంటి మెసేజ్ రాకపోగా ఆన్‌లైన్లో సర్టిఫికెట్ (How to take vaccination certificate online) కూడా జారీ అవలేదు. అప్పుడు కానీ అది ఫేక్ వ్యాక్సిన్ ముఠా అనే విషయం సొసైటీ వాసులకు అర్థం కాలేదు.
సొసైటీకి చెందిన హితేష్ పటేల్ అనే బాధితుడు మాట్లాడుతూ.. వారు మోసం చేసే ఉద్దేశంతో వచ్చారు కనుకే తమను వ్యాక్సిన్లు తీసుకుంటప్పుడు ఫోటోలు, సెల్ఫీలు (Vaccination photos, selfies) తీసుకోనివ్వలేదని అనుమానం వ్యక్తంచేశారు.