తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన టీటీవీ దినకరన్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దినకరన్ నూతన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు. అన్నాడీఎంకే ముఖ్య కార్యదర్శి వికె శశికళకు మేనల్లుడైన దినకరన్ ఆర్కే నగర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. భారీ మెజార్టీతో గెలుపొందిన దినకరన్ ఈ రోజు ఆర్కేనగర్‌లో పర్యటించనున్నారు.
ఓటర్లను మభ్యపెట్టిన్నట్లు అభియోగం
అయితే దినకరన్ ఓటర్లను మభ్యపెట్టి గెలిచారని కూడా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. రూ.20 నోట్లపై ఒక సీక్రెట్ కోడ్ రాసి చాలామంది ఓటర్లకు పంచిపెట్టినట్లు..అలాగే ఓటు వేసి వచ్చాక.. ఈ నోటు చెల్లించే ఓటర్లకు 6 వేల నుండి 10 వేల రూపాయలు ఇస్తామని దినకరన్ వర్గీయులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దినకరన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తేనే.. చెప్పిన మొత్తం చెల్లిస్తామని దినకరన్ వర్గీయులు తెలపడంతో కొందరు ఓటర్లు ఎదురుతిరిగారని.. ఈ క్రమంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు దినకరన్ వర్గీయుల పై కేసు నమోదైందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసు దినకరన్ ఎమ్మెల్యే పదవిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.