Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రాస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అటు కోర్టు కూడా మార్చ్ 28 వరకూ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అత్యవసర విచారణ కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసుకున్న పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అత్యవసరంగా విచారించలేమని, మార్చ్ 27 కోర్టు తెరిచిన తరువాతే విచారిస్తామని తెలిపింది.
మరోవైపు అరెస్ట్ అయినా సరే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయలేదు. అటు ఆప్ నేతలు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటున్నారు. జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని చెబుతున్నారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ సింగ్ మాన్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విడుదలయ్యేవరకు జైలు నుంచే పాలిస్తారని చెప్పారు. జైలుకు వెళ్లినంత మాత్రాన ఎవరూ నేరస్థుడు కాడనేది చట్టమే చెబుతోందని, జైలు నుంచి ముఖ్యమంత్రి పాలన చేయకూడదని కూడా ఎక్కడా లేదని ఆయన అన్నారు. అందుకే జైల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుకు ఢిల్లీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటామన్నారు. పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు, నేతలు ఇవాళ రాష్ట్రంలోని 70 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొవ్వొత్తులతో ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మరోవైపు జైల్లోంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా చదివి విన్పించారు. తన అరెస్టుకు నిరనసగా బీజేపీ నేతలపై ఎలాంటి కోపం , ద్వేషం చూపించవద్దని కేజ్రీవాల్ కోరారు. సమాజం కోసం చేసే పనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని బలహీనపర్చేందుకు చాలా శక్తులున్నాయని, అలాంటి అరాచక శక్తుల్ని గుర్తించి ఓడించాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. త్వరలోనే బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తానని తెలిపారు.
Also read: Vande Bharat Sleeper Trains: మరో ఆరు నెలలు ఆలస్యం కానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook