యూపీలోని దారూల్ ఉలూమ్ దియోబంద్ అనే సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇకపై ముస్లిం యువతులు, బాలికలు ఎవరూ కూడా తమ గోళ్లకు నెయిల్ పాలిష్ పూసుకోరాదని ఆ సంస్థ ఫత్వా జారీ చేసింది. అయితే అవే గోళ్లపై మెహందీ పూసుకుంటే తమకు అభ్యంతరం ఏమీ లేదని సంస్థ తెలిపింది. ఇస్లామ్ సూత్రాల ప్రకారం గోళ్లకు రంగు పూసుకోవడం నిషేధమని ఆయా సంస్థ పేర్కొంది. గతంలో కూడా ఇదే సంస్థ ఇలాంటి వివాదాస్పదమైన ఫత్వాలు జారీ చేసి వార్తలలో నిలిచింది. ముస్లిం స్త్రీలు తమ కనుబొమ్మలను షేపింగ్ చేసుకోరాదని, అలాగే జుత్తు కత్తిరించుకోవడం కూడా నిషేధమని ఫత్వా జారీ చేసింది.
అలాగే ముస్లిం యువతులు సాధ్యమైనంత వరకూ బ్యూటీ పార్లర్లకు వెళ్లకపోతే మంచిదని.. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పదనే విషయాన్ని వారు తెలుసుకోవాలని ఆ సంస్థ గతంలో తెలిపింది. కొందరు ముస్లిం స్త్రీలు ఎక్కువగా మేకప్ వేసుకుంటూ ఉంటారని.. అలా మేకప్ వేసుకోవడం వల్ల పురుషులు ఆకర్షింపబడతారని.. అటువంటి మేకప్ వేసుకోవడం ఇస్లామ్ ప్రకారం నిషిద్ధమని కూడా గతంలో దారూల్ ఉలూమ్ దియోబంద్ తెలియజేయడం గమనార్హం.
కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆంక్షలే ముస్లిం పురుషులకు కూడా ఈ సంస్థ విధించింది. ఇస్లామ్ ప్రకారంగా పురుషులు షేవింగ్ చేసుకోకూడదని.. గతంలో ఈ విషయాన్ని కూడా తాము సీరియస్గా తీసుకున్నామని దారూల్ ఉలూమ్ దియోబంద్ సంస్థ తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో ముస్లిం స్త్రీలు ఫోటోలు పోస్టు చేయడం కూడా నేరం క్రిందకే వస్తుందని.. మతాన్ని భ్రష్టు పట్టించే ఇలాంటి పద్ధతులకు అందరూ స్వస్తి పలకాలని కోరుతున్నామని యూపీలోని సహరన్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ గతంలో పేర్కొంది.