గోవాలో రాష్ట్రపతి పాలనా..?

గోవాలో ప్రభుత్వం ఉన్నా లేనట్లే ఉందని.. ఒక రకంగా రాజ్యాంగ ప్రతిష్టంబన తలెత్తిందని.. అందుకే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 

Last Updated : Sep 3, 2018, 08:01 PM IST
గోవాలో రాష్ట్రపతి పాలనా..?

గోవాలో ప్రభుత్వం ఉన్నా లేనట్లే ఉందని.. ఒక రకంగా రాజ్యాంగ ప్రతిష్టంబన తలెత్తిందని.. అందుకే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సీఎం మనోహర్ పారికర్ అత్యవసర వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారని.. అలాగే మరో ఇద్దరు మంత్రులు కూడా అస్వస్థతకు గురయ్యారని.. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

గోవా కాంగ్రెస్ నేత రమాకాంత్ ఖలప్ మాట్లాడుతూ, మంత్రుల ఆరోగ్యం వేగంగా బాగుపడాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని.. అయితే ప్రజల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలని.. అందుకే రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సీఎం లేకపోవడం వల్ల స్తంబించిపోయిన పాలనను ఒక ప్రతిపక్షంగా తాము చూస్తూ ఊరుకోలేమని.. అందుకే ఈ ప్రతిపాదనను తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం గోవా విద్యుత్ శాఖ మంత్రి పాండురంగం మడ్కైకర్, పట్టణాభివృద్ధి మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ సెలవులో ఉన్నారు. 

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆగస్టు 22వ తేది వరకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అయినా ఆయన శరీరం చికిత్సకు సహకరించక పోవడంతో మెరుగైన చికిత్స కోసం అమెరికాకి వెళ్లాలని సూచించారు. ఆయన ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లినట్లు ఇప్పటికే గోవా సీఎం కార్యాలయం ప్రకటించింది. అయితే పారికర్ తన బాధ్యతలను తాత్కాలికంగా ఏ ఇతర మంత్రికి ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకే కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

Trending News