ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న అత్యవసర బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. కాగా శుక్రవారం రోజు ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు
ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేశారు. అయితే ఆయన అభ్యర్థనను ఢిల్లీ న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ, ఎంఫోర్స్ మెంట్ అధికారులు సిద్ధంగా ఉండగా... ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్ను నిన్న అత్యవసరంగా విచారించడానికి అంగీకరించలేదు. ఈ రోజు మరోమారు పిటిషన్ దాఖలు చేయడంతో విచారించేందుకు సుప్రీంకోర్టు మళ్లీ నిరాకరించింది.
ఇదిలా ఉండగా చిదంబరం కోసం నిన్నటి నుంచి సీబీఐ వెతుకుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో చిదంబరం కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం లేకుండా ఈ మేరకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన అవినీతి కేసుల్లో చిదంబరం నిందితుడిగా ఉన్నారు. ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. కేసులో నింతితుడిగా ఉన్న పి. చిదంబారంకు కాంగ్రెస్ పార్టీ నైతిక మద్దతు తెలపగా .. విజయ్ మాల్కాల చిదంబర ప్రవర్తిస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు సంధిస్తోంది