Uttar Pradesh encounter case: హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ ఎన్కౌంటర్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబెను ( Gangster Vikas Dubey ) అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లిన క్రమంలో ఎన్కౌంటర్ చోటుచేసుకోగా.. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌పై రైడింగ్ జరగనుందనే సమాచారాన్ని చౌబేపూర్ స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారి సదరు గ్యాంగ్‌స్టర్‌కి ముందే లీక్ చేసినట్టు అనుమానిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు.. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు ( Vinay Tiwari suspended ). ఇదే విషయమై కాన్పూర్ ఐజి మోహిత్ అగర్వాల్ స్పందిస్తూ.. పోలీసుల రైడింగ్‌కి సంబంధించిన సమాచారాన్ని వికాస్ దూబేకు లీక్ చేశారనే ( tipping off the gangster ) అనుమానాల కింద అతడిని సస్పెండ్ చేసినట్టు ధృవీకరించారు. అవసరమైతే వికాస్ దూబేపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని ఐజి మోహిత్ అగర్వాల్ తెలిపారు.
( Also read: UP encounter: యూపీలో దుండగుల కాల్పులు.. డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి )
గ్యాంగ్‌స్టర్‌తో ఎస్ఓ వినయ్ తివారికి సంబంధాలు ?:
ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ఎస్ఓ వినయ్ తివారిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దూబెతో వినయ్ తివారికి ఉన్న సంబంధాలు, ఈ ఎన్కౌంటర్లో అతడి పాత్ర ఏంటనే కోణంలో ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని విచారిస్తున్నారు. గతంలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై ఒక బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ.. వినయ్ తివారి ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.
రైడింగ్‌లోనూ వెనుకే నిలబడిన వినయ్ తివారి:
అన్నింటికి మించి పోలీసు ఉన్నతాధికారుల బృందం గ్యాంగ్‌స్టర్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి రైడింగ్ చేస్తున్న సందర్భంలోనూ చౌబేపూర్ ఎస్ఓ అయిన వినయ్ తివారి పోలీసుల బృందంలో చురుకుగా ఉండకుండా వెనుకే ఉండిపోయినట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తోంటే ఈ ఎన్ కౌంటర్ లో అతడి పాత్ర లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
( Also read: COVID-19: ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు )
గ్యాంగ్‌స్టర్ ఆచూకీ చెబితే రూ.50 వేల నజరానా:
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఆచూకీ వెల్లడించిన వారికి రూ.50 వేలు నజరానా అందించనున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా అతడి ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు.
రంగంలోకి 100 పోలీసు బృందాలు, నేపాల్ బార్డర్ సీల్ :
60 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబే కోసం పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి. దాదాపు 100 బృందాలు ఈ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగాయంటే యూపీ సర్కార్ ఈ ఘటనను ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. వికాస్ దూబే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నేపాల్ పారిపోయే అవకాశాలు ఉన్నాయని ముందే పసిగట్టిన పోలీసులు.. యూపీలోని భారత్, నేపాల్ సరిహద్దులను సీల్ చేశారు.
చంబల్‌లో తలదాచుకుని ఉండొచ్చనే సందేహాలు:
మధ్యప్రదేశ్‌లోని చంబల్ అటవీ ప్రాంతంలో వికాస్ దూబే తలదాచుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారమే కాన్పూర్‌లో పర్యటించి బాధిత పోలీసు కుటుంబాలను కలిసి పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని దైర్యం చెప్పిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రభుత్వం తరపున రూ. 1 కోటి ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ఎక్స్ట్రార్డినరి పెన్షన్ ఇవ్వడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించనున్నట్టు సీఎం యోగి భరోసా ఇచ్చారు.
( Also read: AP Ex Minister:వైసీపీ నేత హత్యకేసులో సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి )
ఆయుధాలతో పరారైన దుండగులు:
ఎన్కౌంటర్లో మృతి చెందిన పోలీసులు, గాయపడిన పోలీసుల నుంచి వికాస్ దూబే అనుచరులు ఆయుధాలు అపహరించుకుపోయారు.