ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాతగా బాలీవుడ్ ఆడియెన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీరజ్ ఓరా ఇక లేరు. గతేడాది అక్టోబర్లో భరించలేని గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కోమాలోకి వెళ్లిన ఓరా గురువారం తెల్లవారుజామున 4 గంటలకి తుది శ్వాస విడిచారు. ముంబైలోని క్రిటి కేర్ హాస్పిటల్లో ఓరా మృతిచెందారు. ప్రస్తుతం ఓరా వయస్సు 54 ఏళ్లు.
నీరజ్ ఓరా మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్.. "ఫిర్ హెరా ఫెరీ లాంటి ఎన్నో హిట్ చిత్రాలని తెరకెక్కించిన రచయిత, దర్శకుడు నీరజ్ ఓరా మనకు ఇక లేరు" అంటూ ట్విటర్ ద్వారా దర్శకుడికి నివాళి అర్పించారు.
ఏడాదికి పైగా కోమాలో వున్న ఓరా కోసం అతడి నివాసంలోనే ఒక గదిని ఐసీయుగా మార్చేసి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు ఆయన కుటుంబసభ్యులు. కానీ గత నాలుగు రోజుల క్రితం శరీరంలోని ఇతర కీలకమైన అవయవాలు పనిచేయడం మానేయడంతో కుటుంబసభ్యులు అతడిని ముంబైలోని క్రిటిక్ కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ నీరజ్ ఓరా తుది శ్వాస విడిచారు.