ఢిల్లీని పరిపాలించిన 13వ శతాబ్దపు చక్రవర్తి మరియు క్రూరుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ బతికే ఉన్నాడని సినీ నటి జయప్రద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ను చూస్తే తనకు అల్లావుద్దీన్ ఖిల్జీనే చూసినట్లు ఉంటుందని ఆమె తెలిపారు. ఇటీవలే తాను 'పద్మావత్' చిత్రం చూసినప్పుడు.. తనకు అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో అజంఖానే కనిపించాడని ఆమె అన్నారు.
2009 ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు తనను చిత్రీకరించిన అసభ్యమైన ఫోటోలను ఆజాంఖాన్ విడుదల చేశారని.. తనను వేధించారని జయప్రద తెలిపారు. 2012లో జయప్రద, ఆజాంఖాన్ల మధ్య వార్ నడిచింది. ఒకానొక సందర్భంలో ఆయనను ఉపేక్షించేది లేదని.. ఆయన తన దురహంకారాన్ని వదులుకోకపోతే.. చట్టరీత్యా యాక్షన్ కూడా తీసుకుంటానని తెలిపారు జయప్రద. జయప్రద గతంలో రాంపూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. అదే నియోజకవర్గం నుండి ఆజాంఖాన్ ఎమ్మెల్యేగా గతంలో వ్యవహరించడం గమనార్హం.