'కరోనా వైరస్'ను అడ్డుకునేందుకు ఔషధంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 వరకు వ్యాక్సిన్‌లు పరిశోధన దశలో ఉన్నాయి. అందులో కొన్ని క్లినికల్ ట్రయల్స్‌కు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భారత దేశంలోనూ 'కరోనా వైరస్' మహమ్మారికి మందు కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారితో వైద్యులు, వైద్య సిబ్బంది ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారు. ఐతే ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవం. ఈ క్రమంలో వారు త్వరగా కరోనా మహమ్మారికి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారిని కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడడం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. దీని కోసం కొత్త పరిశోధనకు శ్రీకారం చుట్టింది.
ఇందుకు సంబంధించి పలు రకాల ఆయుష్ ఔషధాలు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నాయా? అనే పరిశోధనలు ప్రారంభించింది. ఆయుష్ ఔషధాలు అశ్వగంధ, యష్టిమధు, గుడుచి పిప్పాలీ, ఆయుష్-64 ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. కరోనా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ఈ ఔషధాలు ఇస్తున్నామని.. నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వారిపై ఎలాంటి పరిణామాలు ఉన్నాయో రోజూ గమనిస్తామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఈ ఔషధాలు అడ్డుకుంటాయా..? లేదా..? ఔషధాల సామర్థ్యం ఎలా ఉంది..? అనే విషయాలు తెలుసుకుంటామని తెలిపారు.
#WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX
— ANI (@ANI) May 7, 2020