వంట చేయమనడం హింసగా భావించలేము: హైకోర్టు

ఇంటిపనులు చేయాలని, రుచికరమైన వంట చేయాలని భార్యకు భర్త చెప్పడం హింసగా భావించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

Last Updated : Aug 6, 2018, 10:46 PM IST
వంట చేయమనడం హింసగా భావించలేము: హైకోర్టు

ఇంటిపనులు చేయాలని, రుచికరమైన వంట చేయాలని భార్యకు భర్త చెప్పడం హింసగా భావించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ముంబైలో 17సంవత్సరాల క్రితం.. విజయ్ ఇంటి పనులు చేయాలని వేధిస్తున్నాడని, అతడికి వివాహేతర సంబంధం ఉందంటూ బాధితురాలు లేఖలో రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు భర్తే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా.. అతడు వేధించినట్లు ఆధారాలు లేవని, ఒకవేళ వంట చేయమని చెప్తే ఆ విషయాన్ని వేధింపులుగా భావించమని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

‘భార్య రుచికరమైన వంట వండడం లేదని, ఇంటి పనులు చేయడంలేదని భర్త చెప్పినంత మాత్రాన అది వేధించినట్లు కాదు. భర్త హింసించడం వల్లే భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవు. భర్తకూ ఎలాంటి వివాహేతర సంబంధాలు లేవు. ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్‌ లాయర్‌ నిందితుల కుటుంబసభ్యులను సరిగ్గా విచారించలేదు. కాబట్టి వారిని దోషులుగా పేర్కొనలేం.’ అని జడ్జి సరంగ్‌ కోత్వాల్‌ తెలిపారు.

1998లో విజయ్‌కు పెళ్లయింది. వివాహమైన కొన్ని రోజుల తర్వాత విజయ్‌ తనను హింసిస్తున్నాడని, వంట సరిగ్గా చేయడంలేదని వేధిస్తున్నాడని బాధితురాలు ఇంట్లో వారికి చెప్పింది. బాధితురాలి కుటుంబసభ్యులు.. ప్రతి చిన్న విషయానికి కొట్టుకోకూడదని, అన్యోన్యంగా ఉండాలని వచ్చి సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత చనిపోతున్నట్లు బాధితురాలు మెసేజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చనిపోయిన మరుసటి రోజు బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం బాంబే హైకోర్టు పైవిధంగా స్పందిస్తూ.. సరైన ఆధారాలు లేవని.. విజయ్‌ను దోషిగా తేల్చలేమని తీర్పునిచ్చింది.

Trending News