ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై విరుచుకుపడ్డారు. ఆయనను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చారు. తన తండ్రికి సైతం నమ్మకస్తుడిగా లేని వ్యక్తి ఐకమత్యం గురించి.. ప్రజల గురించి మాట్లాడకూడదని ఆయనకు ఆదిత్యనాథ్ హితవు పలికారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా తన తండ్రి షాజహాన్ని జైలులో పెట్టించిన క్రూరుడని.. ఈ రోజు ముస్లిములు కూడా తమ పిల్లలకు ఔరంగజేబు పేరు పెట్టాలంటే భయపడతారని ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు.
అలాంటి ఔరంగజేబుకి.. అఖిలేష్ యాదవ్‌కి తేడా లేదని ఆయన తెలిపారు. ఇటీవలే అఖిలేష్ యాదవ్ బీజేపీ పార్టీతో పాటు ఆదిత్యనాథ్ పాలనను దూషించిన క్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ ఆదిత్యనాథ్‌ని "సన్యాసి" అని సంబోధిస్తూ.. 2019లో సీఎం స్థానంలో ఉన్న ఈ సన్యాసి తిరిగి సన్యాసుల మఠానికే వెళ్లాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మొన్నటి వరకు యోగి పాలనలో మతవిద్వేషాలు చెలరేగాయని.. ఇప్పుడు ఆయన రిజర్వేషన్ల చిచ్చు కూడా పెడుతున్నారని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
ఈ క్రమంలో అఖిలేష్ మాటలకు యోగి ఆదిత్యనాథ్ బదులిచ్చారు. ముందు అఖిలేష్ యాదవ్ తన కుటుంబాన్ని, పార్టీని పట్టించుకోవాలని ఆయన హితవు పలికారు. సొంత తండ్రి మనసునే నొప్పించిన వ్యక్తి.. ప్రజలకు సేవ ఏం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో అఖిలేష్‌ను ఆయన ఔరంగజేబుతో పోల్చారు.