నిర్భయ ఘటనకు సరిగ్గా ఐదేళ్లు...

సరిగ్గా ఈ రోజుకి ఐదేళ్ళ క్రితం.. సాక్షాత్తు దేశ రాజధాని నగరంలోనే ఆరు మానవమృగాల కోరలకు చిక్కిన ఓ అబల మానాన్ని కోల్పోయి, సగం ఊపిరితో నడిరోడ్డుపై నగ్నంగా ఆఖరి శ్వాసకై పోరాడుతున్న వేళ.. అమానవీయమైన ఆ దుర్ఘటనకు దేశం మొత్తం ఉలిక్కిపడింది.

Last Updated : Dec 16, 2017, 03:15 PM IST
నిర్భయ ఘటనకు సరిగ్గా ఐదేళ్లు...

సరిగ్గా ఈ రోజుకి ఐదేళ్ళ క్రితం.. సాక్షాత్తు దేశ రాజధాని నగరంలోనే ఆరు మానవమృగాల కోరలకు చిక్కిన ఓ అబల మానాన్ని కోల్పోయి, సగం ఊపిరితో నడిరోడ్డుపై నగ్నంగా ఆఖరి శ్వాసకై పోరాడుతున్న వేళ.. అమానవీయమైన ఆ దుర్ఘటనకు దేశం మొత్తం ఉలిక్కిపడింది. యావత్ ప్రపంచం ఆక్రోశాన్నివెల్లగక్కింది. 13 రోజుల పాటు నరకయాతనను అనుభవించి ఎట్టకేలకు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో డిసెంబరు 29, 2012 తేదిన మృత్యువుతో పోరాడి లోకాన్ని విడిచి వెళ్లిపోయింది ఆ అమాయక బాలిక. అప్పటికి ఆ బాలిక పేరు కూడా పూర్తిగా ఎవరికీ తెలియదు. నిర్భయగా.. అమానత్‌గా.. దామినిగా.. ఆమెను వివిధ పేర్లతో పిలుచుకోసాగారు ప్రజలు. 

ఎందరో ఎన్జీఓ వాలంటీర్లు, యూనివర్సిటీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు నిర్భయకు న్యాయం జరగాలని కోరుతూ రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు.  ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఆ ఘటనపై వివరణ కోరుతూ.. భారత రాష్ట్రపతికి ప్రతీ రోజు లెక్కకు  మించి ఉత్తరాలు వచ్చాయి. సోషల్ మీడియా క్యాంపైన్లను నిర్వహిస్తూ. నిర్భయకు న్యాయం జరగాలని యావత్ విద్యార్థిలోకం కోరుకుంది.  దీంతో ఢిల్లీ సర్కార్ దిగి రాక తప్పలేదు.  యావత్ భారతావనిని కుదిపేసిన ఈ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20) లకు ఢిల్లీ కోర్టు ఎట్టకేలకు మరణశిక్షను విధించింది. ఆ తర్వాత అదే తీర్పును సవాలు చేస్తూ, భారత అత్యున్నత న్యాయస్థానంలో నమోదైన పిటీషన్లను కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయాన్నే సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.

5 మే, 2017 తేదీన నిర్భయ కేసులో తీర్పు వెలువడినా.. ఇప్పటి వరకు అది అమలు కాకపోవడం గమనార్హం. పలు  సంఘాలు ఇప్పటికే ఢిల్లీ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ లోపు దోషులు వినయ్‌ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు  మరణశిక్ష తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ  22 జనవరి, 2018 తేదీన జరగనుంది. 

తొలుత తన కుమార్తె పేరును బయట పెట్టకూడదని భావించినా... ఆ తర్వాత నిర్భయ అసలు పేరు 'జ్యోతి సింగ్' అని బహిరంగ ప్రకటనను విడుదల చేశారు ఆమె తల్లి ఆశాదేవి. నిర్భయ ఘటన జరిగాక, స్త్రీలపై హింసను అరికట్టేందుకు ప్రస్తుత చట్టాలను సమీక్షించి వాటిలో తగు మార్పుల కోసం సూచనలు, అభిప్రాయాలు సేకరించడానికి గాను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌ శరణ్‌ వర్మ అధ్యక్షతన 2012 డిసెంబర్‌ 23న కేంద్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందించిన ఆర్డినెన్స్‌ను కేంద్రప్రభుత్వం 2013, ఫిబ్రవరి 1న ఆమోదించింది. 

Trending News