పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో 11 మంది అరెస్ట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో శనివారం సీబీఐ 11 మందిని అరెస్ట్ చేసింది. 

Last Updated : Mar 18, 2018, 01:04 AM IST
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో 11 మంది అరెస్ట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో శనివారం సీబీఐ 11 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన 11 మందికి మార్చి 28 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అరెస్ట్ అయిన వారిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారి గోకుల్‌నాథ్ శెట్టి, గీతాంజలి గ్రూప్ వైస్ చైర్మన్ ( బ్యాంకింగ్ ఆపరేషన్స్ ) విపుల్ చితాలియా వున్నారు. ఈ 11 మంది అరెస్ట్ కన్నా ముందుగా శనివారం ఉదయమే సీబీఐ అధికారులు 107 కంపెనీలతోపాటు మరో ఏడు లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ వ్యాపార సంస్థల వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు చేపట్టినట్టు ఏఎన్ఐ పేర్కొంది. ఫైర్‌స్టార్ డైమండ్ గ్రూప్ అధినేత నిరవ్ మోదీ, గితాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకుని మోసం చేసిన కేసులో భాగంగానే ఆయా కంపెనీలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు సీబీఐ స్పష్టంచేసింది.

ఇదిలావుంటే, మరోవైపు నిరవ్ మోదీ గతంలో తన వ్యాపార కార్యకలాపాల కోసం తమ వద్ద నామమాత్రపు ధరకే కొనుగోలు చేసిన భూములపై తమకే హక్కు కలిగి వుంటుంది అంటూ అహ్మెద్‌నగర్‌లోని ఖండాలా గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. " వ్యాపారం కోసం బ్యాంకుల వద్ద వేల కోట్లు రుణంగా తీసుకున్న నిరవ్ మోదీ.. రైతులకు మాత్రం రూ.10,000 మించి ఇవ్వలేదు. అది ఓ రకంగా తమకు జరిగిన అన్యాయం. అందుకే ఆ భూములు తిరిగి తమకే చెందుతాయని నిరసన తెలిపేందుకే ఈ భూమి ఆందోళన చేపట్టాం" అని నిరసనలో పాల్గొన్న రైతులు ఏఎన్ఐకి తెలిపారు.  

Trending News