Hyderabad Water Board: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు

Hyderabad Water Board MD Dana Kishore Review Meeting : హైదరాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. ఎండీ దానకిశోర్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి జోనల్ వారిగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Written by - Pavan | Last Updated : Jul 21, 2023, 06:46 AM IST
Hyderabad Water Board: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు

Hyderabad Water Board MD Dana Kishore Review Meeting : హైదరాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. ఎండీ దానకిశోర్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి జోనల్ వారిగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జలమండలి ఎండి దానకిషోర్ మాట్లాడుతూ.. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికోసం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ (ఈఆర్టీ), ఎస్పీటి వాహనాలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తరచూ సీవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే మ్యాన్హోళ్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెండు రోజులుగా నగరంలో వర్షాలు కురుస్తున్నందున.. తాగునీటి సరఫరా, నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో వరద నీటి కారణంగా కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. 

మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు:
ఇప్పటికే 22 వేలకు పైగా మ్యాన్హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కువ లోతు ఉన్న మ్యాన్హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. జలమండలి, జీహెచ్ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను (సిల్ట్) ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. మంచి నీటి పైపు లైను నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ముంపునకు గురైన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. డీప్ మ్యాన్హోళ్ల దగ్గర సీవరేజి సూపర్వైజర్లు ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

సమన్వయంతో పనిచేయాలి:
జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోళ్ల మూతలను తెరవకూడదని ఎండీ దానకిశోర్ విజ్ఞప్తి చేశారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవడం జలమండలి యాక్ట్ లోని 74 వ సెక్షన్ ప్రకారం నేరం అని, వీటిని అతిక్రమిస్తే.. క్రిమినల్ కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. 

రంగంలోకి ఈఆర్టీ బృందాలు, వాహనాలు:
వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో అయిదుగురు సిబ్బందితో పాటు ఇతర అత్యవసరం సామగ్రి ఉంటుంది. వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు వీరికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీవాటర్ మోటర్ ఉంటుంది. అంతేకాకుండా 6 ఎస్పీటి వాహనాలు సైతం అందుబాటులో ఉంచారు. ఇవే కాకుండా.. మరో 16 మినీ ఎయిర్‌టెక్ వాహనాలను సైతం 24 గంటలు అందుబాటులో ఉంచారు.

Trending News