Master of Suspense Hitchcock: 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'పై దిగ్గజ రచయిత ప్రశంసలు

Writer Malladi Venkata Krishnamurthy: మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ బుక్‌పై దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రశంసలు కురిపించారు. ఈ పుస్తకాన్ని అభినందిస్తూ ఆయన ఓ ఆడియోను విడుదల చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 28, 2024, 01:49 PM IST
Master of Suspense Hitchcock: 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'పై దిగ్గజ రచయిత ప్రశంసలు

Writer Malladi Venkata Krishnamurthy: దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గురించి తెలియని తెలుగు ప్రజలు, పాఠకులు ఉండరు. తన నవలలు, పుస్తకాలు, రచనలతో 55 ఏళ్లుగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. మల్లాది పుస్తకాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం తప్ప, ఆయన కనిపించింది - వినిపించింది లేదు. వేరే పుస్తకాల గురించి ఆయన చెప్పడం అరుదు. అటువంటి మల్లాది వెంకట కృష్ణమూర్తిని మెప్పించింది 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' బుక్. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'కు ముందుమాట రాయడమే కాకుండా ఈ పుస్తకాన్ని అభినందిస్తూ మల్లాది వెంకట కృష్ణమూర్తి ఒక ప్రశంసా పూర్వకమైన ఆడియో విడుదల చేశారు.

'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ''ఇంగ్లీష్ సినిమాలు చూడని వారికి కూడా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ పేరు సుపరిచితం. కారణం ఆయన సినిమాల్లోని విశిష్టత. దాన్ని చూసిన వారు చూడని వారికి ఆ సినిమాల గురించి చెప్పేంత విశిష్టమైనవి. కొన్ని మినహాయిస్తే.. హిచ్‌కాక్ తీసినవి క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ డ్రామాలు. ఆయన తన పేరును ఒక బ్రాండ్‌గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకు ఆయన తన ఫోటోలను, చతురోక్తులను బాగా ఉపయోగించుకున్నారు. 'నేను సిండ్రెల్లా సినిమా తీస్తే... ప్రేక్షకులు శవం కోసం ఎదురు చూస్తారు' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హిచ్‌కాక్. 'సైకో' విడుదలయ్యాక ఒక భర్త నుంచి వచ్చిన ఉత్తరాన్ని హిచ్‌కాక్ కు స్టూడియో హెడ్ అందించారు.

 

'సైకో' సినిమాలోని బాత్ టబ్ హత్య సన్నివేశం చూశాక తన భార్య స్నానం చేయడం మానేసిందని, ఏం చేయాలో చెప్పమని సలహా కోరతాడు భర్త. అందుకు హిచ్‌కాక్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? 'మీ ఆవిడను లాండ్రీకి పంపించండి' అని. సస్పెన్స్ గురించి హిచ్‌కాక్ చెప్పింది అక్షర సత్యం. ఆతృతగా ఎదురు చూడటంలోనే ఉత్కంఠ ఉంటుంది. సస్పెన్స్ మహిళ వంటిదని, ఊహకు ఎంత వదిలేస్తే అంత ఉత్కంఠ పెరుగుతుందని హిచ్‌కాక్ చెప్పారు. సినిమా నిడివి ప్రేక్షకుడు బాత్ రూంకు వెళ్లకుండా భరించేంత కాలం మాత్రమే ఉండాలని చెప్పింది కూడా హిచ్‌కాక్. స్నేహితులు పులగం చిన్నారాయణ, రవి పాడి సంపాదకత్వంలో వెలువడ్డ 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పుస్తకంలో ఆయన తీసిన సినిమాల గురించి వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ రెండు వారాల్లో అమ్ముడు కావడం తెలుగు వారికి హిచ్‌కాక్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. పులగం చిన్నారాయణ, రవి పాడి గార్లకు ఆ అభినందనలు. ఈ పుస్తకంలో ముందుమాట రాసే అవకాశం రాకపోతే నేనూ హిచ్‌కాక్ ఫ్యాన్ అని తెలియజేసే అవకాశం ఉండేది కాదు'' అని ఆడియోలో పేర్కొన్నారు. 

ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు భగవద్గీత, బైబిల్ వంటివి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆల్ఫెడ్‌ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల సీనియర్ దర్శకులు వంశీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని హరీష్ శంకర్ అందుకున్నారు.

Also Read: TFI meet with Revanth Reddy: టాలీవుడ్ ఇవి పాటించాల్సిందే.. సీఎం మీటింగ్ లో ఏం చెప్పారంటే..!

Also Read: TFI Meets Revanth Reddy: సినీ ప్రముఖుల ప్రతిపాదనలు.. సీఎం ఏమన్నారంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News